Pachi Mirchi Vepudu : మనం చేసే ప్రతి వంటలోనూ మనం పచ్చి మిరపకాయలను ఉపయోగిస్తూ ఉంటాం. రకరకాల పచ్చళ్లు తయారు చేస్తూ ఉంటాం. పచ్చిమిరపకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కూడా మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పచ్చళ్లు, కూరల్లో మాత్రమే కాకుండా ఈ పచ్చిమిరపకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలతో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే పచ్చిమిరపకాయల వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చిమిరపకాయల వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
బజ్జీ మిరపకాయలు – 10 నుండి 15, పుట్నాల పప్పు – ఒక కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 5, నూనె – 3 టేబుల్ స్పూన్స్.
పచ్చిమిరపకాయల వేపుడు తయారీ విధానం..
ముందుగా పచ్చిమిర్చిని తొడిమలతో సహా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వాటికి నిలువుగా గాటు పెట్టుకోవాలి. తరువాత వాటిలో ఉండే గింజలను తీసేసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక జార్ లో పుట్నాల పప్పు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్లో నిండుగా పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మంటను చిన్నగా చేసి ముందుగా తయారు చేసుకున్న పచ్చిమిర్చిని ఒక్కొక్కటిగా కళాయిలో వేసుకోవాలి. తరువాత వీటిపై లోతుగా ఉండే మూతను ఉంచి అందులో అర గ్లాస్ నీళ్లను పోసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని 3 నిమిషాల పాటు వేయించుకున్న తరువాత మూత తీసి నెమ్మదిగా మరో వైపుకు తిప్పుకోవాలి.
ఇప్పుడు మరలా మూతను ఉంచి మరో మూడు నిమిషాల పాటు వేయించాలి. తరువాత మూత తీసి మిగిలిన పొడిని కూడా వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చిమిరపకాయల వేపుడు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే పప్పు, సాంబార్, పులుసు కూరల్లో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. ఈ మిరపకాయలను ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల 20 రోజుల వరకు తాజాగా ఉంటాయి. పచ్చిమిరపకాయలతో ఈ విధంగా తయారు చేసిన వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.