Palak Dosa : మనం ఆకుకూరలల్లో ఒకటైన పాలకూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పాలకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాలకూరతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పాలకూరతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పాలక్ దోశ కూడా ఒకటి. పాలక్ దోశ చాలా రుచిగా ఉంటుంది. దోశ పిండి, పాలకూర ఉంటే చాలు ఈ దోశను 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ దోశను తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ పాలకూర దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
దోశ పిండి – తగినంత, పాలకూర – ఒక కట్ట, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, పచ్చిమిర్చి – 4, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.
పాలక్ దోశ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత తరిగిన పాలకూర, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి పాలకూరను పూర్తిగా మగ్గించాలి. పాలకూర మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత దీనిని జార్ లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను దోశ పిండిలో వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక పిండిని తీసుకుని దోశలాగా వేసుకోవాలి.
దోశ తడి ఆరిన తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. దోశ ఒకవైపు కాలిన తరువాత మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఇలా దోశ రెండు వైపులా కాలిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలక్ దోశ తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న పిండితో మనం ఎగ్ దోశ, మసాలా దోశను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పాలక్ దోశను తినడం వల్ల మనం రుచితో పాటు పాలకూర వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు.