Palak Phool Makhana Curry : మనం పాలకూరతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పాలకూరతో చేసే ఏ వంటకమైన చాలా రుచిగా ఉంటుంది. అలాగే పాలకూరను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మనం పాలకూరతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పాలక్ ఫూల్ మఖనా కర్రీ కూడా ఒకటి. పాలకూర, ఫూల్ మఖనా కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. మొదటిసారి చేసేవారు కూడా ఈ కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ పాలక్ ఫూల్ మఖనా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ ఫూల్ మఖనా తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలకూర – 4 పెద్ద కట్టలు, నూనె – ఒక టీ స్పూన్, ఫూల్ మఖనా – 50 గ్రా., నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 3, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 5, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, నీళ్లు – 150 ఎమ్ ఎల్, ప్రెష్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్.
పాలక్ ఫూల్ మఖనా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక పాలకూరను వేసి 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ పాలకూరను గిన్నెలోకి తీసుకుని చల్లటి నీటిని పోయాలి. పాలకూర చల్లారిన తరువాత జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఫూల్ మఖనాను వేసి చిన్న మంటపై కొద్దిగా రంగు మారే వరకు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నెయ్యి, మరో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు సగానికి పైగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, కారం వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత ఫూల్ మఖనా వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించిన తరువాత ప్రెష్ క్రీమ్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలక్ ఫూల్ మఖనా తయారవుతుంది. దీనిని వేడి వేడిగా అన్నం, రోటీ, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పాలక్ ఫూల్ మఖనాను కలిపి తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.