Dahi Bhindi : దహీ భిండి…. బెండకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. రాజస్థాన్ వంటకమైన ఈ దహీ భిండి చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలి అని అడిగేంత రుచిగా ఉంటుంది. వెరైటీ కూరలను రుచి చూడాలనుకునే వారు ఇలా దమీ భిండి కర్రీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మొదటిసారి చేసేవారు కూడా ఈ కర్రీని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ దహీ భిండి కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దహీ భిండి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, బెండకాయలు – పావుకిలో, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 4, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – రెండు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు, టమాటాలు – 2, చిలికిన పెరుగు – 200 ఎమ్ ఎల్, నీళ్లు – 200 ఎమ్ ఎల్.
దహీ భిండి తయారీ విధానం..
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. తరువాత వీటిని మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బెండకాయ ముక్కలను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే నూనెలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి కలపాలి. తరువాత టమాటాలను ఫ్యూరీలాగా చేసుకుని వేసుకోవాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత మంటను చిన్నగా చేసి పెరుగు, నీళ్లు పోసి కలపాలి. తరువాత వేయించిన బెండకాయలను కూడా వేసి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దహీ భిండి తయారవుతుంది. దీనిని అన్నం, కూర, చపాతీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. బెండకాయలతో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.