Palakova : సాధారణంగా మనం పాలతో రకరకాల తీపి పదార్థాలను తయారు చేసుకుంటూ ఉంటాం. పాలతో చేసే తీపి పదార్థాలలో పాలకోవా ఒకటి. పాలకోవా చాలా రుచిగా ఉంటుంది. కానీ దీనిని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇంట్లో దీనిని అందరూ తయారు చేసుకోలేరు. కనుక చాలా తక్కువ సమయంలో పాలకోవాను మనం పాలపొడితో తయారు చేసుకోవచ్చు. పాల పొడితో చేసిన ఈ పాలకోవా కూడా చాలా రుచిగా ఉంటుంది. పాలపొడితో ఎంతో రుచిగా ఉండే పాలకోవాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకోవా తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, పాలపొడి – ఒకటిన్నర కప్పు, పాలు – అర కప్పు, పంచదార పొడి – పావు కప్పు, యాలకుల పొడి – చిటికెడు, పిస్తా పలుకులు – కొద్దిగా.
పాలకోవా తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. తరువాత పాలపొడి, పంచదార పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం దగ్గర పడే వరకు చిన్న మంటపై 10 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం కళాయికి అతుక్కోకుండా దగ్గర పడినప్పుడు తయారయినదిగా భావించాలి.
ఇప్పుడు యాలకుల పొడి వేసి.. బాగా కలిపి మరో 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ కోవా బిళ్లలుగా చేసుకోవాలి. పిస్తా పలుకులతో వీటిని గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే ఎంతో రుచిగా ఉండే పాల కోవా తయారవుతుంది. వీటిపై పిస్తాతోపాటు బాదంపప్పు, జీడిపప్పులతోనూ గార్నిష్ చేసుకోవచ్చు. పాలపొడితో చేసుకున్న ఈ కోవా కూడా చాలా రుచిగా ఉంటుంది.