Palakova Recipe : పాలతో చేసుకోదగిన తీపి పదార్థాల్లో పాలకోవా ఒకటి. పాలకోవా ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. స్వీట్ షాపుల్లో ఈ పాలకోవా మనకు ఎక్కవగా దొరుకుతూ ఉంటుంది. అచ్చం షాపుల్లో లభించే విధంగా ఉండే ఈ పాలకోవాను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రుచిగా సులభంగా పాలకోవాను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకోవా తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – ఒక లీటర్, పంచదార – 200 గ్రా..
పాలకోవా తయారీ విధానం..
ముందుగా పాలను ఒక మందపాటి గిన్నెలో పోసి వేడి చేయాలి. ఈ పాలను పెద్ద మంటపై ఒక పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. పాలు పొంగు వచ్చిన తరువాత మంటను చిన్నగా చేసి పాలను కలుపుతూ మరిగించాలి. ఈ పాలు మూడు వంతులు అయ్యే వరకు మరిగించిన తరువాత ఇవి కొద్దిగా చిక్కబడతాయి. తరువాత ఇందులో పంచదారను వేసి కలుపుతూ ఉండాలి. పంచదార వేసిన తరువాత పాలు రంగు మారడాన్ని మనం గమనించవచ్చు. ఈ పాలు దగ్గర పడి కోవాగా మారిన తరువాత చేతికి నెయ్యి రాసుకుని కొద్దిగా కోవా మిశ్రమాన్ని తీసుకుని ఉండలా చుట్టి చూసుకోవాలి.
కోవా మిశ్రమం ఉండలా మారితే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ ఉండలా మారకపోతే మరికొద్ది సేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కోవా మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి లేదా కొద్దిగా వేళ్లతో వత్తి బిళ్లలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కోవా బిళ్లు తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు పండుగలకు ఇలా ఎంతో రుచిగా ఉండే పాలకోవాను తయారు చేసుకుని తినవచ్చు. ఈ పాలకోవాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.