Ragi Vadiyalu : రాగులు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. ఇవి చిరుధాన్యాల్లో ఒకటి. మనకు ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు. రాగుల్లో మన శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. రాగులు మన శరీరానికి చలువ చేస్తాయి. కనుక వీటితో జావను తయారు చేసి వేసవిలో తాగుతుంటారు. అయితే వాస్తవానికి రాగులను కాలాలతో సంబంధం లేకుండా రోజూ తీసుకోవచ్చు. ఇవి మనకు అన్ని కాలాల్లోనూ మేలు చేస్తాయి. రాగులను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అధిక బరువు తగ్గవచ్చు. షుగర్ కంట్రోల్ అవుతుంది. రక్తం బాగా తయారవుతుంది. శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. ఇంకా రాగుల వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి.
అయితే రాగులను చాలా మంది జావ లేదా రొట్టెల రూపంలో తీసుకుంటారు. కానీ వీటితో వివిధ రకాల వంటలను కూడా తయారు చేయవచ్చు. వాటిల్లో రాగుల వడియాలు కూడా ఒకటి. వీటిని తయారు చేసుకుని భోజనంలో అంచుకు పెట్టుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. ఇక వీటిని తయారు చేయడం కూడా సులభమే. రాగులతో వడియాలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగుల వడియాల తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – ఒక కప్పు, నీరు – 5 కప్పులు, కారం – 5 గ్రాములు, ఉప్పు – తగినంత, ఇంగువ – చిటికెడు.
రాగుల వడియాలను తయారు చేసే విధానం..
రాగి పిండిని ఒక పాత్రలోకి తీసుకుని రెండు కప్పుల నీటిని పోసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన ఉంచాలి. మిగిలిన నీటిని ఒక పాత్రలోకి తీసుకుని వేడి చేసి అందులో ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాత కలిపి ఉంచుకున్న రాగి మిశ్రమాన్ని వేడి నీటిలో వేసి బాగా కలిపి ఉడికించాలి. ఉడికిన తరువాత ఇంగువను కలిపి చల్లబరచాలి. బాగా చల్లారిన తరువాత పాలిథీన్ కవర్‌పై స్పూన్‌తో కొద్ది కొద్దిగా వడియాలలాగా పోసి ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత పొడిగా ఉన్న గాలి దూరని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. భోజనానికి ముందు నూనెలో వేయించుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు. బియ్యం పిండితో కాకుండా ఒకసారి వడియాలను ఇలా రాగి పిండితో పెట్టుకోండి. అందరికీ నచ్చుతాయి.