Pallila Pachadi : పల్లీలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పల్లీలను పొడిగా చేసి వంటల్లో వాడుతూ ఉంటాం. అలాగే వీటితో రకరకాల పచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. పల్లి పచ్చడి అనగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. ఈ పల్లి పచ్చడిని మరింత రుచిగా మొదటి సారి చేసే వాళ్లు అలాగే వంటరాని వారు కూడా చేసుకునే విధంగా సులభంగా ఈ పల్లి పచ్చడిని సులువుగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 100 గ్రా., పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – 4, పచ్చిమిర్చి – 10, తరిగిన ఉల్లిపాయ – 1, చింతపండు – చిన్న నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు – 6, జీలకర్ర – ఒక టీస్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత.
పల్లి చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు కొద్దిగా వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో పచ్చిమిర్చిని వేసి వేయించాలి. తరువాత ఇందులోనే కొత్తిమీరను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో టమాట ముక్కలు, చింతపండు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తరువాత ఒక జార్ లో ముందుగా వేయించిన పచ్చిమిర్చి, పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత టమాట ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత ఈ తాళాంపును పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లి పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, దోశ, ఊతప్పం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని రోట్లో వేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు.