Paneer Laddu : పాలతో చేసుకోదగిన పదార్థాలల్లో పనీర్ కూడా ఒకటి. పనీర్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పనీర్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. పనీర్ తో కూరలే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. పనీర్ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా, కమ్మగా ఉంటాయి. ఈ పనీర్ లడ్డూలను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పనీర్ తో లడ్డూలను సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – అర లీటర్, పాల పొడి – పావు కప్పు, కండెన్స్డ్ మిల్క్ – పావు కప్పు, యాలకుల పొడి – కొద్దిగా, నిమ్మరసం – 4 లేదా 5 చుక్కలు, నెయ్యి- ఒక టీ స్పూన్, పాల మీగడ – 3 టీ స్పూన్స్.
పనీర్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. పాలు వేడయ్యాక నిమ్మరసం వేసి కలపాలి. పాలు విరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ఒక జల్లెడలోకి తీసుకోవాలి. తరువాత దీనిని చల్లటి నీటితో కడిగి పనీర్ ను ఒక వస్త్రంలోకి తీసుకుని నీటిని పూర్తిగా పిండేసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక రెండు టీ స్పూన్ల పాలు, పాల మీగడ వేసి కలపాలి. తరువాత పాల పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం దగ్గర పడిన తరువాత ముందుగా తయారు చేసుకున్న పనీర్ ను వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించిన తరువాత కండెన్స్డ్ మిల్క్, యాలకుల పొడి వేసి కలపాలి.
ఈ మిశ్రమాన్ని కళాయికి అంటుకోకుండా వేరయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. కావాలంటే వీటిపై డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పనీర్ లడ్డూలు తయారవుతాయి. ఈ లడ్డూలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా పనీర్ తో అప్పటికప్పుడు ఎంతో రుచికరమైన లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు.