Pappu Chegodilu : పప్పు చెగోడీలు.. ఇవి మనందరికి తెలిసినవే. వీటిని తినని వారు ఉండరనే చెప్పవచ్చు. కరకరలాడుతూ ఈ పప్పు చెగోడీలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి మనకు ఎక్కువగా బయట షాపుల్లో దొరుకుతూ ఉంటాయి. ఈ పప్పు చెగోడీలను రుచిగా, గుల్లగుల్లగా ఉండేలా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పప్పు చెగోడీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పప్పు చెగోడీలు తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక గ్లాస్, మైదా పిండి – అర గ్లాస్, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్ లేదా తగినంత, నానబెట్టిన శనగపప్పు – ముప్పావు గ్లాస్, రెడు ఫుడ్ కలర్ – చిటికెడు.
పప్పు చెగోడీల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి, మైదా పిండి వేసి కలుపుకోవాలి. తరువాత మందంగా ఉండే కళాయిలో లేదా నాన్ స్టిక్ కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఇందులో ఉప్పు, కారం, రెండు టీ స్పూన్ల నూనె వేసి కలపాలి. నీళ్లు వేడయ్యాక ఇందులో ముందుగా కలుపుకున్న పిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండి గోరు వెచ్చగా అయిన తరువాత చేత్తో బాగా కలుపుకోవాలి. తరువాత శనగపప్పులోని నీళ్లు తీసేసి కొద్దిగా ఆరబెట్టుకోవాలి. తరువాత ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ సన్నగా పొడుగ్గా చేత్తో చుట్టుకోవాలి. తరువాత దీనికి శనగపప్పును అద్ది అంతా సమానంగా ఉండేలా చుట్టుకోవాలి.
ఇప్పుడు ఈ పిండిని చెగోడిలా చుట్టుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చెగోడీలను వేసుకోవాలి. ఇవి కొద్దిగా కాలిన తరువాత వీటిని గంటెతో కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా గుల్లగుల్లగా ఉండే పప్పు చెగోడీలు తయారవుతాయి. బయట నుండి కొనుగోలు చేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే పప్పు చెగోడీలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ పప్పు చెగోడీలను పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు.