Pappu Talimpu : ప‌ప్పు తాళింపును ఒక్క‌సారి ఇలా చేసి చూడండి.. అన్నం, చ‌పాతీల్లోకి బాగుంటుంది..!

Pappu Talimpu : మ‌నం కందిప‌ప్పును ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కందిప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. కందిపప్పుతో మ‌నం ర‌క‌ర‌కాల ప‌ప్పు కూర‌ల‌ను, సాంబార్, ప‌ప్పు చారు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా కందిపప్పుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే దాల్ త‌డ్కాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దాల్ త‌డ్కా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేయ‌వ‌చ్చు. దాల్ త‌డ్కాను జీరా రైస్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. లొట్ట‌లేసుకుంటూ తినేంత రుచిగా ఉండేలా ఈ దాల్ త‌డ్కాను ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దాల్ త‌డ్కా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – 100 గ్రా., ప‌సుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఇంగువ – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 3, వెల్లుల్లి త‌రుగు – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ, కారం – అర‌ టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.

Pappu Talimpu recipe in telugu very tasty with rice or chapati
Pappu Talimpu

దాల్ త‌డ్కా త‌యారీ విధానం..

ముందుగా ఒక కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు, కొద్దిగా ప‌సుపు, అర టీ స్పూన్ నూనె వేసి కుక్క‌ర్ మూత పెట్టాలి. ఈ ప‌ప్పును మూడు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఇంగువ‌, ఎండుమిర్చి, వెల్లుల్లి త‌రుగు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ధ‌నియాల పొడి, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత కొత్తిమీర‌, క‌రివేపాకు వేసి వేయించాలి.

ఇప్పుడు ముందుగా త‌యారు చేసుకున్న ప‌ప్పును వేసి క‌ల‌పాలి. ఈ పప్పును మ‌ధ్య‌స్థ మంట‌పై 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక మ‌రో అర టీ స్పూన్ జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత కారం వేసి క‌లిపి స్ట‌వ్ ఆప్ చేసుకోవాలి. ఈ నెయ్యిని ముందుగా త‌యారు చేసుకున్న ప‌ప్పులో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దాల్ త‌డ్కా త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, జీరా రైస్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts