Peanuts Curd : పాల నుండి పెరుగును తయారు చేసుకుని మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పెరుగు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. పెరుగును తీసుకోవడం వల్ల మన శరీరానికి మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు లభిస్తాయి. పెరుగును తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు పెరుగును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే కొందరికి పాలు, పెరుగు వంటి పదార్థాలను తీసుకోవడం వల్ల చర్మంపై అలర్జీలు, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి.
కొందరు లాక్టోస్ ఇన్ టోలరెన్స్ అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యతో బాధపడే వారిలో పాలలో ఉండే లాక్టోస్ జీర్ణం కాదు. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వారు వేరుశనగలతో పెరుగును తయారు చేసి తీసుకోవచ్చు. వేరుశనగలతో పెరుగు అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు చూసింది నిజమే. మనం వంటల్లో వాడే పల్లీలతో మనం రుచికరమైన తియ్యటి పెరుగును తయారు చేసుకుని తినవచ్చు. పల్లీల నుండి పెరుగును తయారు చేయడం చాలా సులభం. ఈ విధంగా తయారు చేసిన పెరుగును తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి సమస్యలు తలెత్తవు. అలాగే మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా లభిస్తాయి. అసలు పల్లీల నుండి పెరుగును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దీని కోసం ముందుగా ఒక గిన్నెలో 100 గ్రాముల పల్లీలను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. తరువాత ఈ పల్లీలను జార్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ లో పావు లీటర్ నీళ్లు పోసి కలపాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాటన్ వస్త్రంలో పోసి చేత్తో పిండుతూ పాలను తీసుకోవాలి. మిగిలిన పిప్పిలో మరికొద్దిగా నీళ్లు పోసి మరలా పాలను తీసుకోవాలి. ఈ పాలను గిన్నెలో పోసి రెండు పొంగులు వచ్చే వరకు కలుపుతూ వేడి చేయాలి. తరువాత వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి. గోరు వెచ్చగా ఉండే ఈ పాలల్లో తోడుకు కొద్దిగా మజ్జిగ లేదా పెరుగు వేసి కలపాలి. తరువాత 5 లేదా 6 పచ్చిమిర్చి తొడిమలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలపై మూత పెట్టి వేడిగా ఉండే చోట ఉంచాలి.
వీటిని 6 గంటల పాటు కదిలించకుండా ఇలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల పల్లీల నుండి పెరుగును సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ పెరుగును ఫ్రిజ్ లో ఉంచడం వల్ల మరింత గట్టిగా తయారవుతుంది. ఈ పెరుగు కూడా చక్కటి రుచిని కలిగి ఉంటుంది.ఈ పెరుగు తయారీలో ఎంత తక్కువగా నీటిని పోస్తే పెరుగు అంత గట్టిగా ఉంటుంది. అలాగే పాలు తీయగా మిగిలిన పిప్పిని దోశ పిండిలో వేసి దోశలు వేసుకోవచ్చు. అలాగే మొక్కలకు కూడా వేయవచ్చు. ప్రస్తుత కాలంలో మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది జంతువుల నుండి వచ్చే ఏ ఆహారాన్ని తీసుకోవడం లేదు. కేవలం వెగన్ ఫుడ్స్ ను మాత్రమే తీసుకుంటున్నారు. అలాంటి వారు ఈ విధంగా పల్లీలతో పెరుగును తయారు చేసుకుని తినవచ్చు.