Plain Vegetable Pulao : వెజిటేబుల్ పులావ్.. కూరగాయలతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా ఫంక్షన్ లల్లో సర్వ్ చేస్తూ ఉంటారు. మసాలా కూరలతో, గ్రేవీ కూరలతో, నాన్ వెజ్ వంటకాలతో తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ పులావ్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో తయారు చేసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. చాలా సులభంగా, రుచిగా ఈ వెజిటేబుల్ పులావ్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెజిటేబుల్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – 200 గ్రా., మీల్ మేకర్ – పావు కప్పు, పచ్చిమిర్చి – 4 నుండి 6, పుదీనా – 2టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు- 2 టేబుల్ స్పూన్స్, అల్లం- ఒక ఇంచుముక్క, తరిగిన టమాట – 1, నూనె – 3 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర -ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, లవంగాలు – 3, యాలకులు – 2, అనాస పువ్వు – 1, పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, క్యారెట్ ముక్కలు – పావు కప్పు, బీన్స్ ముక్కలు – పావు కప్పు, తరిగిన బంగాళాదుంప – పెద్దది ఒకటి, నీళ్లు – ఒకటిముప్పావు గ్లాస్, పచ్చిబఠాణీ – పావు కప్పు, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
వెజిటేబుల్ పులావ్ తయారీ విధానం..
ముందుగా మీల్ మేకర్ ను వేడి నీటిలో వేసి నానబెట్టాలి. తరువాత వీటిలో ఉండే నీటిని పిండేసి పక్కకు ఉంచాలి. తరువాత జార్ లో పచ్చిమిర్చి, పుదీనా, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, టమాట ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్రతో పాటు మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత కరివేపాకు, కూరగాయ ముక్కలు, పచ్చిబఠాణీ వేసి వేయించాలి. కూరగాయ ముక్కలు వేగుతుండగానే మరో గిన్నెలో నీళ్లు, సాజీరా, బిర్యానీ ఆకు, కొద్దిగా కొత్తిమీర వేసి మరిగించాలి. ముక్కలు వేగగానే ఇందులో ఉప్పు, ధనియాల పొడి, మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి.
దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత బియ్యం వేసి కలపాలి. తరువాత వేడి చేసిన నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి మంటను చిన్నగా చేసి ఉడికించాలి. బియ్యం ఉడికి ఆవిరి పోయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి పులావ్ పై టిష్యూ పేపర్ లను ఉంచి నీటిని చల్లుకోవాలి. తరువాత మూత పెట్టి మరో 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ పులావ్ తయారవుతుంది. ఈ పులావ్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.