Poha Laddu : లడ్డూ తినాలనుకుంటున్నారా.. అయితే మీరు పదంటే పదే నిమిషాల్లో రుచికరమైన లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ లడ్డూలను తయారు చేయడం చాలా సులభం. అలాగే చాలా రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటాయి. ఈ లడ్డూలను తయారు చేయడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. ఇంటికి బందువులు వచ్చినప్పుడు, తీపి తినాలనిపించినప్పుడు ఇలా చిటికెలో లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ లడ్డూలను అసలు ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పోహా లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
లావు అటుకులు – ఒకటిన్నర కప్పు, పల్లీలు – అర కప్పు, పంచదార – ముప్పావు కప్పు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్, నెయ్యిలో వేయించిన జీడిపప్పు – 3 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్, పచ్చ కర్పూరం – చిటికెడు.
పోహ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో అటుకులు వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత పల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ పల్లీలపై ఉండే పొట్టు తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు జార్ లో చల్లారిన అటుకులను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే పంచదారను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత చల్లారిన పల్లీలను వేసి పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇదే గిన్నెలో యాలకుల పొడి, పచ్చ కర్పూరం, వేయించిన జీడిపప్పు వేసి కలపాలి.
తరువాత చిన్న కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి బాగా వేడయ్యాక అటుకుల మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. అవసరమైతే మరి కొద్దిగా నెయ్యిని వేడి చేసి వేసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పోహా లడ్డూలు తయారవుతాయి. ఈ లడ్డూలు వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇలా అటుకులతో తరచూ ఒకేరకం వంటకాలు కాకుండా రుచిగా లడ్డూలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.