information

పోస్టాఫీసుల్లో మ‌న‌కు అందుబాటులో ఉన్న ఈ 8 పొదుపు ప‌థ‌కాల గురించి మీకు తెలుసా..?

ఆర్థికంగా ఎద‌గ‌డానికి ఎవ‌రికైనా పొదుపు అనేది చాలా ముఖ్యం. సంపాదించే డ‌బ్బును పొదుపు చేసుకుంటేనే భ‌విష్య‌త్తులో వ‌చ్చే ఆప‌త్కాల స‌మ‌స్య‌ల‌కు ఇబ్బంది ఉండ‌దు. అయితే నేటి త‌రుణంలో అనేక బ్యాంకుల‌తోపాటు పోస్టాఫీసులు కూడా మ‌న‌కు సేవింగ్స్ స్కీమ్స్‌ను అందిస్తున్నాయి. పోస్టాఫీసుల్లో కింద చెప్పిన 8 ర‌కాల సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో దేంతోనైనా డ‌బ్బును పొదుపు చేసుకోవ‌చ్చు. దీంతో వ‌డ్డీ కూడా బాగానే ల‌భిస్తుంది. ఆ పొదుపు ప‌థ‌కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్

దేశంలో ఉన్న పౌరులెవ‌రైనా ఈ పొదుపు చేసుకోవ‌చ్చు. అందుకు గాను పౌరులు త‌మ‌కు స‌మీపంలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి అందులో ఖాతాను తెర‌వాల్సి ఉంటుంది. క‌నిష్టంగా రూ.20 తో ఖాతాను ఓపెన్ చేయ‌వ‌చ్చు. చెక్ అవ‌స‌రం లేక‌పోతే మినిమం బ్యాలెన్స్ రూ.50 ఉంచాలి. అదే చెక్ స‌దుపాయం తీసుకుంటే మినిమం బ్యాలెన్స్ రూ.500 మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్ప‌టికే ఈ ఖాతా ఉన్న వారు కూడా చెక్ స‌దుపాయం పొంద‌వ‌చ్చు. సీబీఎస్ స‌దుపాయం ఉన్న వారికి ప్రస్తుతం ఏటీఎంను అందిస్తున్నారు. అయితే ఇలా పొదుపు చేసుకునే డ‌బ్బుపై 4 శాతం వార్షిక వ‌డ్డీ చెల్లిస్తారు. ఇది ఎప్ప‌టిక‌ప్పుడు మారుతుంది.

post office money saving schemes do you about them

2. రిక‌రింగ్ డిపాజిట్

పోస్టాఫీసుల్లో రిక‌రింగ్ డిపాజిట్‌ను క‌నీసం రూ.10 ల‌తో ప్రారంభించ‌వ‌చ్చు. రూ.5 మొత్తాల్లో ఎంతైనా పొదుపు చేసుకోవ‌చ్చు. ఈ ఖాతా తెరిచేట‌ప్పుడు నామినీల‌ను నియ‌మించుకోవ‌చ్చు. ఈ ప‌థ‌కం ద్వారా సేవ్ చేసే డ‌బ్బుకు 7.2 శాతం వార్షిక వ‌డ్డీని చెల్లిస్తున్నారు. ఒక ఏడాది పాటు ఇలా పొదుపు చేసుకున్నాక ఆ మొత్తం నుంచి 50 శాతం వ‌ర‌కు తీసుకునేలా స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నారు. ఈ స్కీం కాల ప‌రిమితి 5 సంవత్స‌రాలుగా ఉంది.

3. పోస్టాఫీస్ టైం డిపాజిట్

ఈ ఖాతాను రూ.200తో ప్రారంభించాల్సి ఉంటుంది. దీంట్లో పొదుపు చేసే డ‌బ్బుకు కాల ప‌రిమితిని బ‌ట్టి వ‌డ్డీ చెల్లిస్తారు. ఏడాదికైతే 6.9 శాతం, 24 నెల‌ల‌కు 7 శాతం, 3 ఏళ్ల‌కు 7.2 శాతం, 5 ఏళ్ల‌కు 7.7 శాతం వ‌ర‌కు వార్షిక వ‌డ్డీని చెల్లిస్తారు. అయితే వ‌డ్డీని మాత్రం 3 నెల‌ల‌కు ఒక‌సారి లెక్కిస్తారు. కాల ప‌రిమితి ముగిశాక డ‌బ్బు మెచ్యూర్ అవుతుంది. అనంత‌రం అవ‌స‌రం అనుకుంటే డిపాటిజ్‌ను పొడిగించుకోవ‌చ్చు. లేదంటే విత్ డ్రా చేసుకోవ‌చ్చు. ఒక వేళ మెచ్యూర్ అయ్యాక కూడా విత్‌డ్రా చేయ‌క‌పోతే అవి ఆటోమేటిక్‌గా రెన్యూవ‌ల్ అవుతాయి. ఈ పొదుపు స్కీంలో ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి జాయింట్ డిపాజిట్ కూడా చేయ‌వ‌చ్చు.

4. నెలవారీ ఆదాయ ప‌థ‌కం

నెల నెలా ఆదాయం పొందాల‌నుకునే వారికి ఈ ప‌థ‌కం ఉప‌యోగప‌డుతుంది. ఇందులో ఎవ‌రైనా ఒక‌రి పేరిట గ‌రిష్టంగా ఖాతాలో ఒకేసారి రూ.4.50 ల‌క్ష‌ల‌ను వేసుకోవ‌చ్చు. అదే ఇద్ద‌రు వ్య‌క్తులు జాయింట్‌గా ఓపెన్ చేస్తే రూ.9 ల‌క్ష‌లను వేసుకోవ‌చ్చు. వీరికి వార్షిక వ‌డ్డీ 7.60 శాతం చెల్లిస్తారు. నెల నెలా వ‌డ్డీని పోస్టాఫీస్ ఖాతా ద్వారా పొంద‌వ‌చ్చు. అయితే ఇలా డిపాజిట్ చేసిన సొమ్మును ఏడాది త‌రువాతే విత్ డ్రా చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అప్పుడు డిపాజిట్ విలువ‌లో 2 శాతం త‌గ్గించి ఇస్తారు. ఇక 3 ఏళ్లు దాటాక విత్ డ్రా చేసుకుంటే డిపాజిట్ సొమ్ములో 1 శాతం త‌గ్గించి ఇస్తారు.

5. నేష‌న‌ల్ సేవింగ్ స‌ర్టిఫికెట్ (ఎన్ఎస్ఎస్‌)

రూ.100 ఉంటే చాలు ఇందులో పొదుపు ప్రారంభించ‌వ‌చ్చు. దీనికి 7.9 శాతం వార్షిక వ‌డ్డీని చెల్లిస్తున్నారు. గ‌రిష్టంగా ఎంతైనా ఇందులో పొదుపు చేసుకోవ‌చ్చు. ఇలా పొదుపు చేసుకునే మొత్తానికి ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 80 సి కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ప్ర‌స్తుతం 5 ఏళ్ల కాల ప‌రిమితితో ఈ ప‌థ‌కం అందుబాటులో ఉంది. గ‌డువు తీర‌క‌ముందే పెట్టుబ‌డి పెట్టిన మొత్తాన్ని తీసేందుకు వీలు లేదు. కానీ దీంట్లో పెట్టుబ‌డి పెట్టిన వారు మ‌రొక‌రి పేరు మీద‌కు ఒక‌సారి మార్చుకోవ‌చ్చు. ఒక వేళ ఖాతాదారుడు చ‌నిపోతే అత‌ని నామినీల‌కు డ‌బ్బు చెల్లిస్తారు. అప్పుడు ఆటోమేటిక్ గా అకౌంట్ క్లోజ్ అవుతుంది.

6.కిసాన్ వికాస్ ప‌త్ర (కేవీపీ)

రూ.1000, రూ.5వేలు, రూ.10వేలు, రూ.50వేల మొత్తాల్లో ఇందులో పొదుపు చేసుకోవ‌చ్చు. క‌నీసం రూ.1వేయి అయినా పొదుపుతో ప్రారంభించాల్సి ఉంటుంది. దీనికి కాల ప‌రిమితి 113 నెల‌లు. అంటే 9 ఏళ్ల 5 నెల‌లు. ఈ స‌మ‌యంలో పెట్టుబ‌డి పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది. దీనికి నామినీల‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ఒక పోస్టాఫీస్ నుంచి మ‌రొక పోస్టాఫీస్‌కు, ఒక‌రి పేరు మీద నుంచి మ‌రొక‌రి పేరు మీద‌కు వీటిని మార్పించుకోవ‌చ్చు. ఈ పొదుపు మొత్తానికి 7.60 శాతం వార్షిక వ‌డ్డీని చెల్లిస్తారు.

7. పీపీఎఫ్

వృద్ధాప్యంలో ఎవ‌రైనా సంపాదించ‌లేరు క‌నుక ఆ స‌మ‌యంలో నెల నెలా పెన్ష‌న్ త‌ర‌హాలో డ‌బ్బులు వ‌చ్చేలా చేసుకునేందుకు ఈ పొదుపు ప‌థ‌కం ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో 15 ఏళ్ల వ‌ర‌కు నెల నెలా డ‌బ్బును నిర్దిష్ట‌మైన మొత్తాల్లో పొదుపు చేసుకోవ‌చ్చు. దానికి గాను 7.90 శాతం వార్షిక వ‌డ్డీని చెల్లిస్తారు. ఇక 15 ఏళ్ల ముగిసే వ‌రకు పెట్టుబ‌డి సొమ్మును వెన‌క్కి తీసుకునే అవ‌కాశం లేదు. 15 ఏళ్లు దాటాక అవ‌స‌రం అనుకుంటే మ‌రో 5 ఏళ్లు పొడిగించుకోవ‌చ్చు. దీనికి కూడా ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 80 సి కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

8. సుక‌న్య స‌మృద్ధి ఖాతా

క‌నీసం రూ.1000 తో ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. గరిష్టంగా ఏడాదికి ఈ ఖాతాలో రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌మ చేయ‌వ‌చ్చు. త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కులు త‌మ కూతురు పేరిట ఈ ఖాతాను తెర‌వాల్సి ఉంటుంది. ఇందులో జ‌మ చేసే డ‌బ్బుకు 8.40 శాతం వార్షిక వ‌డ్డీని చెల్లిస్తారు. ఆడ‌పిల్ల పుట్టిన తేదీ నుంచి 10 సంవ‌త్స‌రాల లోపే ఈ ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఏడాదిలో క‌నీసం రూ.1000 అయినా డిపాజిట్ చేయాలి. అలా చేయ‌క‌పోతే ఖాతాను ఆపేస్తారు. అయితే రూ.50 పెనాల్టీ చెల్లించి తిరిగి ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు. ఇక అమ్మాయికి 21 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చాక ఖాతాను క్లోజ్ చేసి డ‌బ్బును విత్ డ్రా చేసుకోవ‌చ్చు. అయితే యువ‌తికి 18 ఏళ్లు నిండిన త‌రువాత కూడా డ‌బ్బును విత్ డ్రా చేసుకునేందుకు వీలు క‌ల్పిస్తారు. కానీ యువ‌తికి పెళ్లి అయితేనే అలా డ‌బ్బును విత్ డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. లేదంటే 21 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే.

Admin

Recent Posts