Potato Carrot Fry : క్యారెట్.. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. క్యారెట్ లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. క్యారెట్ తో మనం రకరకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. క్యారెట్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో క్యారెట్ బంగాళాదుంప ఫ్రై కూడా ఒకటి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ క్యారెట్ బంగాళాదుంప ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ బంగాళాదుంప ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యారెట్ ముక్కలు -ఒక కప్పు, బంగాళాదుంప ముక్కలు – రెండు కప్పులు, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ఎండుమిర్చి -2, కరివేపాకు -ఒక రెమ్మ.
క్యారెట్ బంగాళాదుంప ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత క్యారెట్ ముక్కలు, కొద్దిగా ఉప్పువేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత బంగాళాదుంప ముక్కలను వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు చక్కగా వేగిన తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి.
వీటిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ బంగాళాదుంప ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా క్యారెట్ ఫ్రైను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.