Potato Papad : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ బంగాళాదుంపలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ బంగాళాదుంపలతో కూరలు, వేపుళ్లు, స్నాక్స్ మాత్మే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే పాపడ్ లను కూడా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో చేసే ఈ పాపడ్ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే ఆరు నెలల పాటు తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే పొటాటో పాపడ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పొటాటో పాపడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – పావుకిలో, జీలకర్ర – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన పుదీనా – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్.
పొటాటో పాపడ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బంగాళాదుంపలను తురిమి తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకుంటూ బంగాళాదుంప మిశ్రమాన్ని తీసుకుని ఉండలా చేసుకోవాలి. దీనిని నూనె రాసిన ప్లాస్టిక్ కవర్ మీద వేసి అప్పడంలా వత్తుకోవాలి. తరువాత ఈ అప్పడాన్ని మరో కవర్ మీద వేసుకోవాలి. చేత్తో వత్తుకోవడం రాని వారు పూరీ ప్రెస్ తో వత్తుకుని కవర్ మీద వేసుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత ఎండలో ఉంచి ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన తరువాత వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇవి ఆరు నెలల పాటు పాడవకుండా తాజాగా ఉంటాయి. ఇలా చేయడం వల్ల పొటాటో పాపడ్ తయారవుతుంది. వీటిని వేయించడానికి కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప అప్పడాలను ఒక్కొక్కటిగా వేసి వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని నేరుగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. అలాగే పప్పు, సాంబార్ వంటి వాటితో కూడా అప్పడాలను తినవచ్చు.