సహజ సౌందర్య ప్రియులకు ఆముదం గురించి పరిచయం అవసరం లేదు. అయితే జుట్టు పెరుగుదల కోసం ఇది ఏ విధంగా సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం. దీనిని మీ తలకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు ఆరోగ్యాన్ని, మెరుపును, పెరుగుదలను పెంచుతుంది. అయితే దీనిని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు, అయినప్పటికీ ఆముదంలోని కొన్ని పోషకాలు-యాంటీఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు వంటివి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
థైరాయిడ్ వ్యాధి, అలోపేసియా అరేటా వంటి వ్యాధుల వలన జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. తీవ్రమైన మానసిక లేదా భావోద్వేగ ఒత్తిడి సమయంలో కూడా ఎక్కువగా జుట్టు రాలిపోతుంది. మీరు చేసే ప్రయత్నాలలో ఆముదాన్ని కూడా భాగం చేయవచ్చు. జుట్టు పెరుగుదలకు ఆముదం నూనెను ఉపయోగించేందుకు, మీ తలకు కొన్ని చుక్కలను అప్లై చేసి, మసాజ్ చేయండి. మీరు ఆముదం నూనెను పొడి జుట్టుకు హెయిర్ మాస్క్‌గా కూడా అప్లై చేయవచ్చు. నూనెను మీ జుట్టుకు రుద్దండి, ఆపై మీ తలను షవర్ క్యాప్‌తో సుమారు రెండు గంటలపాటు కప్పి ఉంచాలి. ఆ తరువాత షాంపూ అప్లై చేయాలి. ఎక్కువ నీటితో మీ జుట్టుని పూర్తిగా కడగాలి.
ఈ కింద చెప్పిన విధంగా ఆముదంతో నూనెను తయారు చేసుకుని జుట్టుకి అప్లై చేసుకోండి. కావాల్సినవి.. 1 చెంచా ఆముదం నూనె, 2 రోజ్ మేరీ నూనె చుక్కలు, 1 చెంచా కొబ్బరి నూనె. ఈ మూడింటిని ఒక చిన్న బౌల్ లో వేసుకుని రాత్రి సమయంలో మాడుకి అప్లై చేసుకుని ఉంచండి. మరుసటి రోజు ఉదయాన్నే తేలికపాటి షాంపూతో కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 1 చెంచా ఆముదం నూనె, టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ 2చుక్కలు, 1 చెంచా కలబంద గుజ్జు వేసి కలిపి దీనిని ఓవర్ నైట్ మాడుకి అప్లై చేసుకుని ఉంచితే చుండ్రు శాశ్వతంగా తొలగిపోతుంది. 1 చెంచా ఆముదం నూనె, 1 గుడ్డు, 2 చెంచాల కొబ్బరి నూనె వేసుకుని జుట్టుకి అప్లై చేస్తే.. జుట్టు చివర్లలో ఉన్న పగుళ్లు పోతాయి.