Potlakaya Perugu Pachadi : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో పొట్లకాయ కూడా ఒకటి. పొట్లకాయ మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని చాలా మంది ఇష్టంగా తినరు. కానీ పొట్లకాయతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. ఈ కూరలను తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పొట్లకాయతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా ఒకటి. పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్లకాయ పెరుగు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, మెంతులు – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పొట్లకాయలు – 300 గ్రా., పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, పచ్చిమిర్చి – 5, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిలికిన పెరుగు – అర లీటర్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1.
పొట్లకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం..
ముందుగా జార్ లో పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత పొట్లకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి ముక్కలను మెత్తగా ఉడికించాలి. పొట్లకాయ ముక్కలు ఉడికిన తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత పెరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పెరుగు పచ్చడి చేసుకోవడానికి లేతగా ఉండే పొట్లకాయను ఉపయోగించాలి. అప్పుడే ఈ పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పొట్లకాయతో చేసిన పెరుగు పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.