Prawns Pulao : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఏదో ఒక నాన్‌వెజ్ వంటకాన్ని వండుకుని తింటుంటారు. చికెన్, మటన్, చేపలు.. ఇలా రకరకాల మాంసాహారాలను తింటారు. అయితే ప్రాన్స్.. రొయ్యలను కూడా ఎక్కువగానే తింటారు. ఇవి ధర ఎక్కువ అన్నమాటే కానీ.. ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. అనేక మినరల్స్ వీటిలో ఉంటాయి. అందువల్ల వీటిని తింటే మన శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. ఇక రొయ్యలతోనూ రకరకాల వంటలు చేయవచ్చు. వాటిల్లో పులావ్ కూడా ఒకటి. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే రొయ్యల పులావ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్యల పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
రొయ్యలు – రెండు కప్పులు, పసుపు – అర టీస్పూన్, బాస్మతి బియ్యం – రెండు కప్పులు, నూనె – పావు కప్పు, దాల్చిన చెక్క – చిన్న ముక్క, యాలకులు, లవంగాలు – 5 చొప్పున, బిర్యానీ ఆకులు – రెండు, జీలకర్ర – ఒక టీస్పూన్, ఉల్లిపాయ, టమాటా – ఒక్కోటి చొప్పున, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీస్పూన్, టమాటా ప్యూరీ – ఒక టేబుల్ స్పూన్, కారం, గరం మసాలా – ఒక టీస్పూన్ చొప్పున, ధనియాల పొడి – రెండు టీస్పూన్లు, ఉప్పు – తగినంత, చక్కెర – చిటికెడు, కరివేపాకు రెబ్బలు – రెండు, పచ్చి మిర్చి – రెండు, కొత్తిమీర తరుగు – పావు కప్పు, నిమ్మరసం – రెండు టీస్పూన్లు.
రొయ్యల పులావ్‌ను తయారు చేసే విధానం..
శుభ్రం చేసిన రొయ్యలపై పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బాస్మతి బియ్యం తీసుకుని సరిపడా నీళ్లు పోసి పొడి పొడిగా వండుకుని పక్కన ఉంచాలి. స్టవ్ మీద బాణలి పెట్టాలి. అది వేడయ్యాక నూనో వేసి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు, జీలకర్ర వేయించాలి. రెండు నిమిషాలయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి ఎర్రగా వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటా ముక్కలు వేయాలి. రెండు నిమిషాల తరువాత టమాటా ప్యూరీ, గరం మసాలా, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి రొయ్యల్ని వేసుకోవాలి. ఇది చిక్కగా అవుతున్నప్పుడు కరివేపాకు, నిమ్మరసం, అన్నం వేసి బాగా వేయించాలి. 5 నిమిషాలు అయ్యాక కొత్తిమీర తరుగు వేసి దించాలి. అంతే.. రుచికరమైన రొయ్యల పులావ్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా తినవచ్చు. లేదా రైతా, మిర్చి కా సాలన్‌తోనూ తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.