Ragi Jonna Chikki : రాగి జొన్న చిక్కీలు.. రాగి అటుకులు, జొన్న అటుకులతో చేసే ఈ చిక్కీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ అటుకులను తినవచ్చు. ఈ చిక్కీలను తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. పిల్లలకు బయట లభించే ఎనర్జీ చిక్కీలను ఇవ్వడానికి బదులుగా ఇలా ఇంట్లోనే అటుకులతో చిక్కీలను తయారు చేసి ఇవ్వవచ్చు. వీటిని రోజుకు ఒకటి చొప్పున తిన్నా కూడా మనకు ఎంతో మేలు కలుగుతుంది. అలాగే ఎవరైనా ఈ చిక్కీలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి జొన్న చిక్కీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి జొన్న చిక్కి తయారీకి కావల్సిన పదార్థాలు..
మందంగా ఉండే అటుకులు -ఒక కప్పు, జొన్న అటుకులు – అర కప్పు, రాగి అటుకులు – అర కప్పు, సన్నగా తరిగిన బాదంపలుకులు – పావు కప్పు, తరిగిన జీడిపప్పు పలుకులు – పావు కప్పు,సోంపు గింజలు – ఒక టీ స్పూన్, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నీళ్లు – 2 స్పూన్స్, నెయ్యి – అర టీ స్పూన్.
రాగి జొన్న చిక్కి తయారీ విధానం..
ముందుగా కళాయిలో అటుకులు వేసివేయించాలి. ఇవికొద్దిగా వేగిన తరువాత రాగి అటుకులు, జొన్న అటుకులు వేసి వేయించాలి. అటుకులు క్రిస్పీగా అయిన తరువాత గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత బాదంపప్పు, జీడిపప్పును కూడా వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత సోంపు గింజలు వేసి వేయించి అన్నింటిని గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కేక్ మౌల్ లేదా ఏదైనా గిన్నెను తీసుకుని అందులో సిల్వర్ పాయిల్ ను వేసి ఉంచాలి. సిల్వర్ పాయిల్ అందుబాటులో లేని వారు గిన్నెకు నెయ్యి రాసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగి గట్టి ఉండపాకం వచ్చే వరకు ఉడికించాలి. బెల్లం మిశ్రమం నీటిలో వేసి చూస్తే గట్టి ఉండగా మారాలి.
ఇలా పాకం తయారవ్వగానే అందులో నెయ్యి వేసి కలపాలి. తరువాత వేయించిన అటుకులు, డ్రైఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసి అంతా కలిసేలా బాగాకలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకున్న గిన్నెలో వేసి పైన సమానంగా చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత ప్లేట్ లోకితీసుకుని మనకు కావల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారి గట్టి పడిన తరువాత ముక్కలుగా చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిక్కీలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల మనం చక్కటి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.