Ragi Malt Sharbat : రాగి మాల్ట్ షర్బత్.. రాగి జావతో చేసే ఈ షర్బత్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రాగి జావను మనలో చాలా మంది ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. తరుచూ ఒకేరకంగా కాకుండా ఈ రాగి జావను మరింత రుచిగా తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తాగుతారు. రాగి జావ ఇష్టపడని పిల్లలకు ఇలా దానిని షర్బత్ లాగా చేసి ఇవ్వడం వల్ల వారు మరింత ఇష్టంగా తాగుతారు. శరీరానికి చలువ చేయడంతో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి మాల్ట్ షర్బత్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి మాల్ట్ షర్బత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నిమ్మరసం – అర చెక్క, పంచదార – ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్, ఐస్ క్యూబ్స్ – తగినన్ని, నానబెట్టిన సబ్జా గింజలు – ఒక టీ స్పూన్, రాగి జావ – తగినంత, పుదీనా ఆకులు – 5 లేదా 6, ఉప్పు – చిటికెడు.
రాగి మాల్ట్ షర్బత్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నిమ్మరసాన్ని తీసుకోవాలి. తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత ఐస్ క్యూబ్స్, సబ్జా గింజలు వేసి కలపాలి. తరువాత తగినంత రాగి జావ వేసి కలపాలి. తరువాత కొన్ని పుదీనా ఆకులు, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల రాగి మాల్ట్ షర్బత్ తయారవుతుంది. దీనిని గ్లాస్ లో పోసి చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన రాగి షర్బత్ ను తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు.