Ragi Rotte : చిరు ధాన్యాల్లో రాగులు కూడా ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే. రాగుల్లో మన శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా మనకు ఎంతో అవసరం అయిన ఐరన్ రాగుల ద్వారా లభిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్త హీనత నుంచి బయట పడవచ్చు. అలాగే రాగుల్లో మన శరీరానికి అవసరం అయ్యే దాదాపు అనేక పోషకాలు ఉంటాయి. కనుకనే రాగులను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే రాగులతో మనం అనేక రకాల వంటలను చేయవచ్చు. వాటిల్లో రాగి రొట్టె కూడా ఒకటి. కానీ దీన్ని మెత్తగా ఎలా చేసుకోవాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే కింద తెలిపిన విధంగా ప్రయత్నిస్తే రాగి రొట్టెలను చేయడం పెద్ద కష్టమేమీ కాదు. చాలా సులభంగానే వీటిని తయారు చేసుకోవచ్చు. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి రొట్టెల తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – ఒక కప్పు, మునగాకు – అర కప్పు, వెల్లుల్లి – రెండు రెబ్బలు, పచ్చి మిర్చి – 2, ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, నువ్వులు – 2 టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – తగినన్ని.

రాగి రొట్టెలను తయారు చేసే విధానం..
ఒక పాత్రలో రాగి పిండిని తీసుకుని అందులో మునగాకు, పచ్చి మిర్చి, తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ప్లాస్టిక్ కవర్‌పై నూనె రాసి ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి. తరువాత ఒక్కోదాన్ని వత్తుకుంటూ రొట్టెలలా చేసుకోవాలి. స్టవ్ పై పెనం పెట్టి కొద్దిగా నూనె వేసుకుంటూ రొట్టెలు కాల్చాలి. వీటిని రెండు వైపులా సరిగ్గా కాల్చిన తరువాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన రాగి రొట్టెలు తయారవుతాయి. వీటిని ఏ కూరతో అయినా తినవచ్చు. లేదా పెరుగులో ముంచి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. ఇవి మిక్కిలి ఆరోగ్యకరమైన రొట్టెలు కూడా. గోధుమ రొట్టె కన్నా రాగి రొట్టెలు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. కనుక వీటిని రోజూ తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.