Hibiscus Flowers : మనం ఇంటి పెరట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల మొక్కల్లో మందార మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనందరికి తెలిసిందే. అలాగే మందార మొక్కలో ఔషధ గుణాలు ఉంటాయని జుట్టు సంరక్షణలో ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయని మనందరికి తెలుసు. మందార పువ్వులను కానీ, ఆకులను కానీ మన జుట్టుకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. ఈ మందార పువ్వులతో ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా, మృదువుగా కూడా తయారవుతుంది. కేవలం ముఖ సౌందర్యాన్ని, కేశ సౌందర్యాన్ని పెంచడంలోనే కాదు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా మందార చెట్టు మనకు ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా ఈ మందార పువ్వులతో చేసిన టీ ని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మందార పవ్వులతో టీ ని ఎలా తయారు చేసుకోవాలి… ఈ టీని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మందార పువ్వుల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కానీ ఎర్ర ఒంటి రెక్క మందారాల్లో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఈ టీని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా మనం మూడు ఎర్ర మందారాలను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఈ పూల రేకులను విడివిడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత మందార పువ్వు రేకులను వేయాలి.

వీటిని ఒక నిమిషం పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. పది నిమిషాల తరువాత ఈ నీటిని వడకట్టి ఒక కప్పులోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక అర చెక్క నిమ్మరసాన్ని, ఒక టీ స్పూన్ తేనెను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మందార పువ్వుల టీ ని ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. మందార పువ్వుల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ టీని తాగడం వల్ల చర్మం పై ముడతలు తొలగిపోవడంతో పాటు వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. మందార టీ ని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తొలగిపోతుంది.
షుగర్ వ్యాధి గ్రస్తులకు ఈ మందార టీ చక్కటి ఔషధంలా పని చేస్తుంది. ఈ టీ ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రోజుకు రెండు పూటలా ఈ టీ ని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు, మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఈ మందార టీ ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మందార టీ ని తాగడం శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అధిక బరువుతో బాధపడే వారు రోజుకు ఒక కప్పు మందార టీని తాగడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్దకాన్ని తగ్గించడంలో ఈ మందార టీ మనకు ఎంతో ఉపయోగపడుతుంది.
అలాగే ఈ టీ ని తాగడం వల్ల శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను నశించి క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాం. వేడి శరీరతత్వంతో బాధపడే వారు ఈ టీని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. మందార పువ్వులను ఎండబెట్టి పొడిగా చేసి కూడా మనం టీ ని తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం మనకు మార్కెట్ లో మందార టీ లతోచేసిన పొడి కూడా లభ్యమవుతుంది. దీనితో కూడా మనం ఈ టీ ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మందార పూలతో చేసిన టీ ని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.