Rava Paratha : బొంబాయి రవ్వను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రవ్వతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది రవ్వతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. ఈ రవ్వతో మనం ఎంతో రుచిగా, మెత్తగా ఉండే పరోటాలను తయారు చేసుకోవచ్చు. ఈ పరోటాలు చల్లారిన తరువాత కూడా చాలా మెత్తగా ఉంటాయి. ఈ పరోటాలను తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, సులభంగా రవ్వతో పరోటాలను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ పరోటా తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, నీళ్లు – ఒకటిముప్పావు కప్పు, ఉప్పు – తగినంత, మైదా పిండి – అర కప్పు.
రవ్వ పరోటా తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో రవ్వను తీసుకుని ఒక నిమిషం పాటు మిక్సీ పట్టుకోవాలి. తరువాత గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత మంటను మధ్యస్థంగా చేసి మిక్సీ పట్టుకున్న రవ్వను వేస్తూ కలుపుకోవాలి. దీనిని మెత్తగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకుని గంటెతో మెత్తగా వత్తుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా మైదాపిండిని చల్లుకుంటూ చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ పిండిని పగుళ్లు లేకుండా చపాతీ పిండిలా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి. తరువాత పెద్ద నిమ్మకాయంత పిండిని తీసుకుని గుండ్రంగా వత్తుకోవాలి. తరువాత పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం బాగా వేడయ్యాక వత్తుకున్న పరోటాను వేసి కాల్చుకోవాలి. ముందుగా రెండు వైపులా కొద్ది కొద్దిగా కాల్చుకున్న తరువాత నెయ్యి లేదా నూనె వేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా మెత్తగా ఉండే రవ్వ పరోటాలు తయారవుతాయి. వీటిని మసాలా కూరలు, వివిధ రకాల చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. రవ్వతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా రవ్వ పరోటాలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.