Ravva Aloo Puri : మనం అల్పాహారంలో భాగంగా అప్పుడప్పుడూ పూరీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఏ కూరతో తిన్నా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనకు టిఫిన్ సెంటర్లలో కూడా ఇవి లభిస్తూ ఉంటాయి. వీటిని ఎక్కువగా మనం గోధుమపిండితో తయారు చేస్తూ ఉంటాం. తరచూ గోధుమపిండితో చేసే ఈ పూరీలను మనం మరింత రుచిగా రవ్వ, బంగాళాదుంపలు వేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన పూరీలు కూడా పొంగుతూ చాలా రుచిగా ఉంటాయి. రవ్వ ఆలూ పూరీలను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ ఆలూ పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉప్మా రవ్వ – అర కప్పు, వేడి నీళ్లు – ముప్పావు కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిల్లీ ప్లేక్స్ – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప – 1, గోధుమపిండి – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రవ్వ ఆలూ పూరీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రవ్వను తీసుకోవాలి. తరువాత ఇందులో వేడి నీటిని పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు రవ్వను నాననివ్వాలి. రవ్వ నానిన తరువాత ఇందులో పిండి, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. బంగాళాదుంపను మెత్తగా చేసి వేసుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ చపాతీ పిండిలా ఉండలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. పిండి నానిన తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ పూరీలా వత్తుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పూరీని వేసి కాల్చుకోవాలి. పూరీ వేసిన వెంటనే గంటెతో నూనెలోకి వత్తాలి. ఇలా చేయడం వల్ల పూరీ చక్కగా పొంగుతుంది. తరువాత వీటిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ ఆలూ పూరీలు తయారవుతాయి. వీటిని వెజ్, నాన్ వెజ్ కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.