Ravva Appalu : మనం బొంబాయి రవ్వతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసేవంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రవ్వ అప్పాలు కూడా ఒకటి. రవ్వ అప్పాలు చాలా రుచిగా ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. అలాగే ప్రసాదంగా కూడా ఈ రవ్వ అప్పాలను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, మెత్తగా ఉండే రవ్వ అప్పాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదర్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ అప్పాల తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, పంచదార – ఒక కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రవ్వ అప్పాల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రవ్వను, పంచదారను, యాలకుల పొడిని వేసి కలపాలి. తరువాత గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత రవ్వ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ రవ్వను మెత్తగా దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రవ్వను చల్లారే వరకు ఉంచిన తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ రవ్వను బాగా కలుపుకోవాలి. తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అప్పాలుగా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మధ్యస్థంగా వేడయ్యాక అప్పాలను వేసి కాల్చుకోవాలి. వీటిని రెండు నిమిషాల పాటు అలాగే ఉంచిన తరువాత అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత వీటిని గంటెలోకి తీసుకుని ఎక్కువగా ఉండే నూనెలా పోయేలా మరో గంటెతో వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ అప్పాలు చల్లారిన తరువాత డబ్బాలో వేసి గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ అప్పాలు తయారవుతాయి. ఈ అప్పాలు 3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఈ అప్పాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.