Ravva Curry : మనం బొంబాయి రవ్వతో ఉప్మాతో పాటు వివిధ రకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసే వంటకాలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. అయితే ఉప్మా, చిరుతిళ్లే కాకుండా రవ్వతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా రవ్వతో ఎంతో రుచిగా ఉండే కూరను తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. రవ్వతో సులభంగా, రుచిగా కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – చిన్న ముక్క, లవంగాలు – 2, యాలకులు – 2, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, టమాటాలు – 2, చిలికిన పెరుగు – పావు కప్పు, నీళ్లు – 2 గ్లాసులు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రవ్వ బాల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ముప్పావు కప్పు, శనగపిండి – అర కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ధనియాల పొడి – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, గరం మసాలా -అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రవ్వ కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రవ్వను తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత రవ్వను కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రవ్వ బాల్స్ ను వేసి వేయించాలి. వీటిని 70 శాతం వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి.
దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత టమాట ఫ్యూరీ వేసి కలపాలి. తరువాత మంటను చిన్నగా చేసి పెరుగు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకుని నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత నీళ్లు పోసి ఉడికించాలి. నీళ్లు మరిగిన తరువాత వేయించిన రవ్వ బాల్స్ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నుండి 12 నిమిషాల పాటు ఉడికించాలి. రవ్వ బాల్స్ మెత్తగా ఉడికిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. వెరైటీ రుచులను ట్రై చేయాలనుకునే వారు ఇలా రవ్వతో కూడా కూరను వండుకుని తినవచ్చు.