Ravva Halwa : హల్వా.. మనకు స్వీట్ షాపుల్లో లభించే తీపి వంటకాల్లో ఇది కూడా ఒకటి. హల్వా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగాతింటారు. అలాగే మనకు వివిధ రుచుల్లో ఈ హల్వా లభిస్తూ ఉంటుంది. ఈ హల్వాను తయారు చేసుకోవడానికి గానూ మనం కార్న్ ఫ్లోర్ ను ఉపయోగిస్తూ ఉంటాము. అయితే కార్న్ ఫ్లొర్ తో పాటు మనం రవ్వతో కూడా హలకవాను కూడా తయారు చేసుకోవచ్చు. రవ్వతో చేసే ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, కమ్మగా ఉండే ఈ రవ్వ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, నీళ్లు – 2 కప్పులు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – పావు కప్పు, పంచదార – ఒకటి ముప్పావు కప్పు, ఫుడ్ కలర్ – చిటికెడు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
రవ్ హల్వా తయారీ విధానం..
ముందుగా జార్ లో వేసి పిండిలా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నీళ్లు పోసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఇలా నానబెట్టుకున్న రవ్వను మరోసారి జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నెయ్యిలో అర కప్పు పంచదార వేసి క్యారమెల్ లా అయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. పంచదార క్యారమెల్ లాగా అయిన తరువాత మిగిలిన పంచదారను, పావు కప్పు నీళ్లను పోసి కలపాలి. పంచదార పూర్తిగా కరిగిన తరువాత మిక్సీ పట్టుకున్న రవ్వ మిశ్రమం వేసి కలపాలి. దీనినిమధ్యస్థ మంటపై కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత ఫుడ్ కలర్ వేసి కలపాలి. తరువాత రెండు టీ స్పూన్ల నెయ్యిని వేస్తూ కలపాలి. హల్వా నెయ్యిని పీల్చుకున్న తరువాత మరో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. ఇలా అర కప్పు నెయ్యి వరకు హల్వాలో వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా మనం వేసిన నెయ్యి మరలా పైకి తేలే వరకు ఈ హల్వాను కలుపుతూ ఉడికించాలి. నెయ్యి పైకి తేలగానే యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ హల్వా తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.