Ravva Pulihora : వంటల్లో నిమ్మరసాన్ని ఉపయోగిచండం వల్ల చక్కటి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ విషయం మనందరికి తెలిసందే. నిమ్మకాయ రసాన్ని వంటల్లో ఉపయోగించడంతో పాటు నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ పులిహోర వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా ఈ నిమ్మకాయలతో మనం నిమ్మకాయ పిండి వంటి ఇతర వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. దీనినే పిండి పులిహోర, రవ్వ పులిహోర అని కూడా పిలుస్తారు. ఈ నిమ్మకాయ పిండి అనేవంటకం చాలా రుచిగా ఉంటుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే దీనిని తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారు కూడా చాలా చక్కగా దీనిని తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయ పిండి అనే ఈ వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ పిండి తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం రవ్వ – ఒక గ్లాస్, నిమ్మకాయలు – 3, నీళ్లు – రెండు గ్లాసులు, నూనె – 3 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్.

తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, పల్లీలు – 3 టీ స్పూన్స్, శనగపప్పు – 2 టీ స్పూన్స్, మినపప్పు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 5 లేదా తగినన్ని.
నిమ్మకాయ పిండి తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నీళ్లు, ఉప్పు, పసుపు, నూనె వేసి మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం రవ్వ వేసి ఉండలు లేకుండా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి అంతా కలిసేలా బాగా కలుపుకుని వెడల్పుగా ఉండే మరో గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత దీనిని ముందుగా ఉడికించిన బియ్యం రవ్వలో వేసి కలపాలి. తరువాత నిమ్మరసం వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ పిండి తయారవుతుంది. దీనిని ఉదయం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా సాయంత్రం సమయాల్లో తయారు చేసుకుని తినవచ్చు. ఈ నిమ్మకాయ పిండిని ఇంకా కావాలని అడిగి మరీ ఇష్టంగా తింటారు.