Red Chilli Chicken : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలలో రెడ్ చిల్లీ చికెన్ కూడా ఒకటి. ఈ చికెన్ వెరైటీ చాలా రుచిగా ఉంటుంది. స్టాటర్ గా, స్నాక్స్ గా, సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ రెడ్ చిల్లీ చికెన్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు, బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా దీనిని తయారు చేయవచ్చు. రెడ్ చిల్లీ చికెన్ రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ చిల్లీ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – అరకిలో, కోడిగుడ్డు – 1, ఉప్పు – తగినంత, తెల్ల మిరియాల పొడి – ఒక టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, అల్లం తరుగు -ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ – చిన్నది ఒకటి, నీళ్లు – 2 టీ గ్లాసులు, కారం – అర టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్, టమాట కిచప్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ – చిటికెడు, జీడిపప్పు పలుకులు – కొద్దిగా.
రెడ్ చిల్లీ చికెన్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో కోడిగుడ్డు, ఉప్పు, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, మైదాపిండి వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత చికన్ ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత నీళ్లు, కారం, ఉప్పు, అర టీ స్పూన్ తెల్ల మిరియాల పొడి, టమాట కిచప్, చిల్లీ సాస్ వేసి కలపాలి.
దీనిని దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత వేయించిన చికెన్ ముక్కలు వేసి కలపాలి. చికెన్ ముక్కలు డ్రై గా అయ్యే వరకు వేయించి జీడిపప్పును చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రెడ్ చిల్లీ చికెన్ తయారవుతుంది. దీనిని నిమ్మరసం, ఉల్లిపాయలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. స్నాన్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి.