Restaurant Style Jeera Rice : మన ఇంట్లో ఉండే తాళింపు పదార్థాల్లో జీలకర్ర ఒకటి. వంటల్లో జీలకర్రను వాడడం వల్ల వంటల రుచి మరింత పెరుగుతుంది. అంతేకాకుండా జీలకర్ర ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. మనకు వచ్చే వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో జీలకర్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. జీలకర్రతో చేసుకోదగిన వాటిల్లో జీరా రైస్ ఒకటి. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. దీనిని మనం అప్పుడప్పుడూ వంటింట్లో తయారుచేస్తూనే ఉంటాం. ఈ జీరా రైస్ ను రుచిగా రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతి బియ్యం – రెండున్నర టీ గ్లాసులు, నీళ్లు – 5 టీ గ్లాసులు, నూనె – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – రెండు టీ స్పూన్లు, తరిగిన పచ్చిమిర్చి – 5, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత.
రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బాస్యతీ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఇందులో నీళ్లు పోసి అర గంట పాటు నానబెట్టాలి. తరువాత ఒక కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. ఇవి వేడయ్యాక పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ముందుగా నానబెట్టిన బాస్మతీ బియ్యాన్ని నీటితో సహా వేసుకోవాలి. తరువాత రుచికి తగినంత ఉప్పును వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూతను ఉంచి దగ్గర పడే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తరువాత మూత తీయకుండా 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ జీరా రైస్ ను వెజ్, నాన్ వెజ్ మసాలా కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు లేదా రుచిగా తినాలనిపసించినప్పుడు ఇలా జీరా రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు.