Rice Flour Snacks : మనం బియ్యంపిండితో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బియ్యంపిండితో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో బియ్యంపిండి వడలు కూడా ఒకటి. బియ్యంపిండితో చేసే వడలు చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ వడలు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. అలాగే ఇన్ స్టాంట్ గా వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. బియ్యంపిండితో వడలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండి వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉడికించిన స్వీట్ కార్న్ – 2 టేబుల్ స్పూన్స్, ఉడికించిన బఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – ముప్పావు కప్పు, నూనె డీప్ ఫ్రైకు సరిపడా.
బియ్యంపిండి వడల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. తరువాత పిండి తప్ప మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. వీటిని చేత్తో బాగా కలిపిన తరువాత కొద్ది కొద్దిగా బియ్యంపిండి వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీటిని చల్లుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత చేతులకు నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వడలాగా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వడలను వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు అలాగే ఉంచిన తరువాత అటూ ఇటూ కదుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యంపిండి వడలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా బియ్యంపిండితో వడలను తయారు చేసుకుని తినవచ్చు.