Roti Laddu : గోధుమపిండితో చేసే వంటకాల్లో రోటీలు కూడా ఒకటి. బరువు తగ్గడానికి, షుగర్ ను అదుపులో ఉంచుకోవడానికి, అలాగే అల్పాహారంగా కూడా రోటీలను తయారు చేసుకుని తింటాము. ఒక్కోసారి మనం చేసిన రోటీలు మిగిలి పోతూ ఉంటాయి. చల్లారిన రోటీలను తినడానికి ఎవరు ఇష్టపడరు. అలా అని వీటిని పారేయలేము. ఇలా మిగిలిన రోటీలను పడేయకుండా వాటితో రుచికరమైన లడ్డూలను తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలను చాలా సులభంగా పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. మిగిలిన రోటీలతో అప్పటికప్పుడు రుచికరమైన లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రోటి లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
రోటీలు – 4, నెయ్యి – 2 టీ స్పూన్స్, పాలు – 100 ఎమ్ ఎల్, బెల్లం తురుము – 100 గ్రా., యాలకుల పొడి – అర టీ స్పూన్.
రోటి లడ్డూ తయారీ విధానం..
ముందుగా రోటీలను ముక్కలుగా చేసి జార్ లో వేసుకోవాలి. తరువాత వీటిని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత పాలు పోసి మరిగించాలి. పాలు మరిగి ఒక పొంగు వచ్చిన తరువాత బెల్లం తురుము వేసి కలపాలి. బెల్లం కరిగిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. బెల్లం మిశ్రమం ఉడికి ఒక పొంగు వచ్చిన తరువాత మిక్సీ పట్టుకున్న రోటీ పొడి వేసి కలపాలి. దీనిని పూర్తిగా దగ్గరయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం ఉడికి నెయ్యి పైకి తేలిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రోటి లడ్డూలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. కేవలం గోధుమపిండితో చేసిన రోటీలతోనే కాకుండా జొన్నపిండి, సజ్జపిండి, రాగిపిండితో చేసిన రోటీలతో కూడా ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు.