Saggubiyyam Bellam Payasam : వేసవి కాలం భగ్గుమంటోంది. ఇంకా ఏప్రిల్ నెల కూడా రాలేదు.. ఎండలు మండిపోతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు ముందే ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రతి వేసవి లాగే ఈ సారి కూడా ఎండల నుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. అందులో భాగంగానే శరీరాన్ని చల్లగా ఉంచడం కోసం పలు రకాల పానీయాలను తాగుతున్నారు. ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే వేసవి సీజన్‌లో తీసుకోవాల్సిన ఆహారాల్లో ఒకటి సగ్గుబియ్యం.
సగ్గుబియ్యం మన శరీరానికి ఎంతోచలువ చేస్తుంది. వీటిని తింటే శరీరం చల్లగా మారుతుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. ఈ క్రమంలోనే సగ్గుబియ్యం, బెల్లం కలిపి తయారు చేసే పాయసాన్ని తాగడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. మరి పాయసాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
సగ్గుబియ్యం, బెల్లం పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
సగ్గు బియ్యం – ఒక కప్పు, పాలు – అర లీటర్, బెల్లం తురుము – ఒకటిన్నర కప్పు, నీళ్లు – అర లీటర్, నెయ్యి – 2 టీ స్పూన్స్, బాదం పప్పు- ఒక టీ స్పూన్, జీడి పప్పు – ఒక టీ స్పూన్, ఎండు ద్రాక్ష – ఒక టీ స్పూన్, యాలకుల పొడి – ఒక టీ స్పూన్.
సగ్గు బియ్యం, బెల్లం పాయసం తయారు చేసే విధానం..
మొదటగా సగ్గు బియాన్ని ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి గంట సేపు నానబెట్టాలి. తరువాత ఒక కడాయిలో అర లీటర్ నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిలో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి 15 నిమిషాల పాటు ఉడికించాలి. కొద్దిగా వేడి చేసిన చిక్కని పాలను ఉడుకుతున్న సగ్గుబియ్యంలో వేసి మరో 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిసి స్టవ్ ఆఫ్ చేయాలి. పాలల్లో బెల్లం తురుము వేస్తే పాలు విరిగిపోతాయి. కనుక స్టవ్ ఆఫ్ చేసిన తరువాత బెల్లం తురుము వేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. తరువాత ఒక చిన్న కడాయిలో నెయ్యి వేసి కాగాక బాదం పప్పు, జీడి పప్పు, ఎండు ద్రాక్ష వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. వీటిని ముందుగా చేసి పెట్టుకున్న సగ్గు బియ్యం పాయసంలో వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల పర్‌ఫెక్ట్ లుక్ తో రుచికరమైన సగ్గు బియ్యం పాయసం రెడీ అవుతుంది. దీన్ని తింటే శరీరం చల్లగా ఉండడంతోపాటు అనేక లాభాలు పొందవచ్చు.
సగ్గుబియ్యం పాయసాన్ని ఇలా బెల్లం వేసి తయారు చేసుకుని తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవి తాపం నుంచి బయట పడడంతోపాటు జీర్ణ సమస్యలు రావు. ఈ సీజన్‌లో విరేచనాల సమస్య చాలా మందికి ఉంటుంది. కనుక ఈ పాయసం తాగితే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే మలబద్దకం, గ్యాస్ తగ్గిపోతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది.