Saggubiyyam Bonda : వేసవి కాలంలో మనం శరీరాన్ని చల్ల బరుచుకునేందుకు అనేక ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో సగ్గు బియ్యం కూడా ఒకటి. ఇవి మనకు ఎంతో చలువ చేస్తాయి. కనుక వేసవిలో సగ్గుబియ్యాన్ని ఎక్కువగా తింటుంటారు. వీటితో జావ చేసుకోవచ్చు. స్వీట్లు కూడా తయారు చేసుకోవచ్చు. అయితే కేవలం వేసవిలోనే కాదు.. మనం ఏ సీజన్‌లో అయినా సరే వీటిని తీసుకోవచ్చు. ఎందుకంటే సగ్గు బియ్యంతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి సగ్గు బియ్యాన్ని సీజన్లతో సంబంధం లేకుండా తీసుకోవచ్చు. ఇక వీటితో ఎంతో రుచికరమైన బొండాలను కూడా చేసుకోవచ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గు బియ్యం బొండాల తయారీకి కావల్సిన పదార్థాలు..
సగ్గు బియ్యం – 1 కప్పు, మజ్జిగ – 1 కప్పు, ఉప్పు – తగినంత, పచ్చి మిర్చి – 2, అల్లం – చిన్న ముక్క, బియ్యం పిండి – పావు కప్పు, పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర – 1 కట్ట, కరివేపాకు – 2 రెబ్బలు, ఎండు కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర – 1 టీస్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.

సగ్గు బియ్యం బొండాలను తయారు చేసే విధానం..
ఒక పాత్రలో సగ్గు బియ్యాన్ని తీసుకుని నీళ్లతో శుభ్రంగా కడగాలి. తరువాత అందులో మజ్జిగ పోయాలి. తరిగిన పచ్చి మిర్చి, అల్లం ముక్క, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. మూత పెట్టి 8 గంటల పాటు పక్కన పెట్టాలి. పల్లీలను వేయించి పొడి చేసుకోవాలి. సగ్గు బియ్యం మజ్జిగను గ్రహించి మెత్తగా అవుతాయి. ఇప్పుడు బియ్యం పిండి, పల్లీల పొడి, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి తురుము, జీలకర్ర వేసి కలుపుకోవాలి. అవసరం అయితే నీళ్లు కలుపుకోవచ్చు. తరువాత స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోయాలి. అర చేతులకు కాస్త నూనె రాసుకుని మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బొండాల్లా చేసుకుంటూ నూనెలో వేసి వేయించుకుంటే బొండాలు రెడీ అయినట్లే. ఇవి ఎంతో టేస్టీగా ఉండడమే కాదు.. అందరికీ నచ్చుతాయి. వీటిని పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీలతో తినవచ్చు.