Dates : ఖర్జూరాలు మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. ఇవి డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ లభిస్తాయి. ఇవి ఎంతో తియ్యగా ఉంటాయి. కనుక చాలా మంది ఖర్జూరాలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఖర్జూరాలను చాలా మంది తియ్యని వంటల్లోనూ వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే ఖర్జూరాలతో మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీటితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. వీటిని ఎలా తీసుకుంటే ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూరాలు రక్తహీనతకు ఔషధంగా పనిచేస్తాయి. వీటిల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక రోజూ 3 ఖర్జూరాలను రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు ముందు వీటిని తినాలి. ఇలా రోజూ తింటుంటే రక్తం అధికంగా తయారవుతుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. ఇక మహిళలకు రుతు సమయంలో నొప్పి, ఇతర సమస్యలు ఉంటాయి. కనుక వారు ఆ సమయంలో ఖర్జూరాలను తింటే ఎంతో రిలీఫ్ లభిస్తుంది. వీటిల్లో ఉండే కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. స్త్రీల సమస్యలను తగ్గిస్తుంది.
ఇక సన్నగా, బలహీనంగా ఉన్నవారు దృఢంగా మారి బరువు పెరగాలంటే అందుకు ఖర్జూరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని 3 తీసుకుని మేకపాలలో వేసి 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టాలి. అనంతరం వాటిని తినాలి. ఇలా రోజూ చేస్తుంటే తప్పక ఫలితం కనిపిస్తుంది. బరువు పెరుగుతారు. శరీరం దృఢంగా మారుతుంది.
వీటిని పాలలో వేసి మరిగించి అనంతరం ఆ పాలను తాగి ఖర్జూరాలను తినాలి. ఇలా రోజూ రాత్రి పూట చేయాలి. దీంతో శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటారు. రోజంతా నీరసంగా, బలహీనంగా, అలసటగా ఉందని భావించేవారు ఇలా చేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది. ఎంతో ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. ఇక ఖర్జూరాల గుజ్జులో కాస్త మిరియాల పొడి చల్లి తింటే రక్త విరేచనాలు తగ్గుతాయి. అలాగే మలబద్దకం ఉన్నవారు రెండు ఖర్జూరాలు, రెండు అంజీర్ పండ్లను రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి ఉదయం పరగడుపునే తినాలి. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఖర్జూరాలు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. వీటిలో అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.