Saggubiyyam Mixture : మనకు స్వీట్ షాపుల్లో లభించే వివిధ రకాల మిక్చర్ లల్లో సగ్గు బియ్యం మిక్చర్ కూడా ఒకటి. ఈ మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ మిక్చర్ ను ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే ఈ మిక్చర్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిక్చర్ ను తయారు చేయడం చాలా తేలిక. సగ్గుబియ్యంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే మిక్చర్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గు బియ్యం మిక్చర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
లావుగా ఉండే నైలాన్ సగ్గుబియ్యం – 300 గ్రా., నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, పల్లీలు – అర కప్పు, జీడిపప్పు – పావు కప్పు, ఎండుద్రాక్ష – పావు కప్పు, సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు – అర కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – రెండు రెబ్బలు, ఉప్పు – తగినంత, పంచదార పొడి – 2 టీ స్పూన్స్.
సగ్గుబియ్యం మిక్చర్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక సగ్గుబియ్యం వేసి వేయించాలి. వీటిని కలుపుతూ తెల్లగా ఉబ్బి పగిలే వరకు వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే నూనెలో పల్లీలను వేసి వేయించాలి. పల్లీలు వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పదార్థాలన్నింటిని ఒక్కొక్కటిగా వేసి వేయిచి ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే ఒక గిన్నెలో ఉప్పు, పంచదార పొడి వేసి కలపాలి.
ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ లో లేదా గిన్నెలో వేయించిన సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. తరువాత అలాగే వేయించిన మిగిలిన పదార్థాలను వేసి కలపాలి. చివరగా ఉప్పు, పంచదార పొడి మిశ్రమాన్ని చల్లుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సగ్గు బియ్యం మిక్చర్ తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 3 నుండి 4 రోజుల పాటు తాజాగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.