Soya Manchurian Rolls : మనకు రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో ఎక్కువగా లభించే పదార్థాల్లో సోయా మంచురియన్ రోల్స్ ఒకటి. సోయా చంక్స్ తో చేసే ఈ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సోయా మంచురియన్ రోల్స్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రుచిగా, చాలా సులభంగా సోయా మంచురియన్ రోల్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సోయా మంచురియన్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, గోధుమపిండి – పావు కప్పు, పంచదార – అర టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, గోరు వెచ్చని నీళ్లు – తగినన్ని, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్న ముక్కలుగా తరిగిన పచ్చిమిర్చి – 4, వెనిగర్ – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, టమాట కిచప్ – ఒక టీ స్పూన్, షెజ్వాన్ సాస్ – ఒక టేబుల్ స్పూన్, క్యాబేజ్ తురుము – రెండు కప్పులు, చాట్ మసాలా – కొద్దిగా, చీజ్ – కొద్దిగా.
సోయా మంచురియా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉప్పు – తగినంత, సోయా చంక్స్ – ఒక కప్పు, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్, మైదా పిండి – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, కారం – అర టీ స్పూన్, డార్క్ సోయా సాస్ – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
సోయా మంచురియన్ రోల్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, గోధుమపిండి, పంచదార, ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లను పోస్తూ పిండిని మెత్తగా వత్తుకోవాలి. తరువాత దీనిపై వస్త్రాన్ని ఉంచి గంట పాటు నానబెట్టాలి. తరువాత ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ పంచదార, రెండు చిటికెల ఉప్పు, వెనిగర్ వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 45 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో నీళ్లు, ఉప్పు వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత సోయా చంక్స్ ను వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి. తరువాత వీటిని వడకట్టి చల్లటి నీటిలో వేసుకోవాలి. తరువాత నీరంతా పోయేలా వీటిని చేత్తో గట్టిగా పిండుతూ గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన మంచురియా తయారీకి కావల్సిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సోయా చంక్స్ ను వేసి వేయించాలి.
వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి పెద్ద మంటపై వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత గ్రీన్ చిల్లీ సాస్, టమాట కిచప్, రెండు చిటికెల ఉప్పు, షెజ్వాన్ సాస్, ఒక టీ స్పూన్ వెనిగర్ వేసి సాస్ చిక్కబడే వరకు బాగా కలుపుతూ వేయించాలి. సాసెస్ చిక్కబడిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వేసి చిక్కబడే వరకు కలపాలి. తరువాత వేయించిన సోయా చంక్స్ వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని మరోసారి బాగా కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ వీలైనంత పలుచగా వత్తుకోవాలి. తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం బాగా వేడయ్యాక వత్తుకున్న చపాతీని వేసి 30 సెకన్ల పాటు రెండు వైపులా కాల్చుకోవాలి.
ఇలా కాల్చుకున్న రోటిని ప్లేట్ లోకి తీసుకుని వాటిపై వెంటనే రుమాల్ ను కప్పి ఉంచి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఉల్లిపాయలను వడకట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు ముందుగా కాల్చుకున్న రోటీలను పెనం మీద వేసి నూనె వేస్తూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక రోటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత దానిపై ఒక టీ స్పూన్ షెజ్వాన్ సాస్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత దీనిపై సోయా మంచురియాను నిలువుగా ఉంచాలి. తరువాత దానిపై ఉల్లిపాయ ముక్కలను, క్యాబేజ్ తురుమును ఉంచాలి. తరువాత చీజ్ ను తురిమి వేసుకోవాలి. చివరగా దీనిపై టమాట కిచప్ ను, చాట్ మసాలాను వేసుకోవాలి. ఇప్పుడు వేళ్లతో అన్నింటిని లోపలికి వత్తుకుంటూ బిగుత్తుగా రోల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సోయా మంచురియన్ రోల్స్ తయారవుతాయి. వీకెండ్స్ లో లేదా సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా వీటిని తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.