Saggubiyyam Punugulu : సగ్గుబియ్యం.. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. సగ్గుబియ్ంయతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. సగ్గుబియ్యంతో ఎక్కువగా మనం తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కేవలం తీపి వంటకాలే కాకుండా ఈ సగ్గుబియ్యంతో మనం స్నాక్స్ ను కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా సగ్గుబియ్యంతో చేసే ఈ స్నాక్స్ వెరైటీ చాలా రుచిగా ఉంటుంది. సగ్గుబియ్యం ఉంటే చాలు ఈ వంటకాన్ని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ సగ్గుబియ్యం బాల్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గుబియ్యం బాల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన సగ్గు బియ్యం – ఒక కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – 2, వేయించిన పల్లీల పొడి – అర కప్పు, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, జీలకర్ర – అర టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క, ఉప్పు – తగినంత, పంచదార – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.

సగ్గుబియ్యం బాల్స్ తయారీ విధానం..
ముందుగా సగ్గుబియ్యంలో ఉండే నీటిని తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత చేతికి నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా సగ్గుబియ్యం మిశ్రమాన్ని తీసుకుంటూ ఉండలాగా చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సిద్దం చేసుకున్న సగ్గుబియ్యం ఉండలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం బాల్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా సగ్గుబియ్యంతో అప్పటికప్పుడు రుచిగా ఈ వంటకాన్ని తయారు చేసుకుని తినవచ్చు.