Sajja Dosa : మనకు అందుబాటులో ఉండే చిరు ధాన్యాలలో సజ్జలు ఒకటి. సజ్జల వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. భారతీయులు చాలా కాలం నుండి సజ్జలను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. పూర్వ కాలంలో ఎక్కువగా సజ్జలతో చేసిన సంగటిని ఆహారంగా తీసుకునే వారు. సజ్జలల్లో ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయి. హైబీపీని, గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సజ్జలు ఎంతగానో సహాయపడతాయి. సజ్జలల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక అజీర్తి సమస్య ఉన్న వారు సజ్జలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
బరువు తగ్గాలనుకునే వారికి సజ్జలు ఎంతగానో సహాయపడతాయి. సజ్జలల్లో ఉండే మెగ్నిషియం టైప్ 2 డయాబెటిస్ ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మహిళల్లో పిత్తాశయంలో రాళ్లు ఏర్పకుండా చేయడంలో సజ్జల పాత్ర ఎంతో ఉంటుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న సజ్జలతో రుచికరమైన దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు సజ్జల దోశను ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావల్సిన పదార్థాలు ఏమిటి ? అన్న వివరాలను తెలుసుకుందాం.
సజ్జల దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక కప్పు, సజ్జలు – ఒక కప్పు, బియ్యం – ఒక కప్పు, శనగపప్పు – కొద్దిగా, ఉప్పు – తగినంత.
సజ్జల దోశ తయారు చేసుకునే విధానం..
మొదటగా ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలు అన్నింటినీ వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 5 – 6 గంటలు నానబెట్టాలి. ఇప్పుడు ఒక జార్ లో వీటిని వేసి మెత్తగా దోశ పిండిలా పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని 7-8 గంటలు పులియబెట్టాలి. ఈ పిండి బాగా పులిసిన తరువాత తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం మీద దోశలా వేసుకోవాలి. ఎర్రగా కాలాక తీసి.. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.
సజ్జలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. హైబీపీ, అజీర్తి, డయేరియాను తగ్గించడంలో సజ్జలు ఎంతో సహాయపడతాయి. ఇలా సజ్జలతో దోశలు వేసుకుని తింటే ఓ వైపు రుచి, మరోవైపు ఆరోగ్యం లభిస్తాయి.