Sapota Juice : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో సపోటాలు కూడా ఒకటి. సపోటాలు ఎంత రుచిగా, కమ్మగా ఉంటాయో మనందరికి తెలిసిందే. సపోటాలను తినడం వల్ల మన శరీరానికి అనేక రకాల పోషకాలు అందుతాయి. అలాగే వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. కంటి చూపును మెరుగుపరచడంలో, చర్మాన్ని మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, మలబద్దకాన్ని నివారించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇలా అనేక రకాలుగా సపోటాలు మనకు మేలు చేస్తాయి. సపోటాలను నేరుగా తినడంతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా, చల్లగా ఉండే జ్యూస్ ను కూడా తయారు చేసుకోవచ్చు.
సపోటా జ్యూస్ ను తాగడం వల్ల వేసవి తాపం నుండి ఉపశమనం కలగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. రుచిగా, చల్ల చల్లగా సపోటా జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సపోటా జ్యూస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పండిన సపోటాలు – 8, పంచదార – 3 టీ స్పూన్స్, కాచి చల్లార్చిన పాలు – ఒకటిన్నర టీ గ్లాసులు, ఐస్ క్యూబ్స్ – తగినన్ని.
సపోటా జ్యూస్ తయారీ విధానం..
ముందుగా సపోటాలపై ఉండే పొట్టును తీసేయాలి. తరువాత వాటిలో ఉండే గింజలను తీసేసి ముక్కలుగా చేసి జార్ లోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో మిగిలిన పదార్థాలన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ జ్యూస్ ను గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ జ్యూస్ పై మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ను చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సపోటా జ్యూస్ తయారవుతుంది. ఇందులో పంచదారకు బదులుగా తేనెను కలుపుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వేసవికాలంలో బయట లభించే శీతల పానీయాలను తాగడానికి బదులుగా ఇలా ఇంట్లోనే సపోటా జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ జ్యూస్ ను అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.