Semiya Janthikalu : మనం సేమియాను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దీనితో ఎక్కువగా సేమియా ఉప్మా, సేమియా పాయసం వంటి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అయితే సేమియాతో తరుచూ చేసే వంటకాలతో పాటు మనం జంతికలను కూడా తయారు చేసుకోవచ్చు. సేమియాతో చేసే ఈ జంతికలు చాలా రుచిగా,గుల్ల గుల్లగా ఉంటాయి. పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఈ జంతికలను తయారు చేయడం కూడా చాలా సులభం. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవిచాలా చక్కగా ఉంటాయి. సేమియాతో రుచిగా, గుల్లగుల్లగా జంతికలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సేమియా జంతికల తయారీకి కావల్సిన పదార్థాలు..
సేమియా – ఒక కప్పు, బియ్యంపిండి – 2 కప్పులు, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, వేడి నూనె – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
సేమియా జంతికల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో సేమియా వేసి తగినన్ని నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత వీటిలో ఉండే నీరంతా పోయేలా వడకట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పిండి, కారం, నువ్వులు, ఉప్పు, వేడి నూనె వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని చల్లుకుంటూ పిండిని మెత్తగా కలుసుకోవాలి. తరువాత మురుకుల గొట్టాన్ని తీసుకుని దానికి నూనె రాసుకోవాలి. తరువాత అందులో పిండిని ఉంచి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జంతికలను వత్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా జంతికలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి. తరుచూ ఒకేరకం జంతికలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.