Sesame Seeds Laddu : మనం వంటింట్లో తరచుగా నువ్వులను ఉపయోగిస్తూ ఉన్నాం. నువ్వుల నుండి తీసిన నూనెతో కూరలు, పచ్చళ్ల తయారీతోపాటు చర్మం, జుట్టు సంరక్షణలో భాగంగా కూడా ఉపయోగిస్తూ ఉన్నాం. నువ్వులను పొడిగా చేసి కూడా వాడుతూ ఉంటాం. అవే కాకుండా నువ్వులను తీపి పదార్థాలు, పిండి వంటకాల తయారీలోనూ ఎక్కువగానే ఉపయోగిస్తూ ఉన్నాం. నువ్వులు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నువ్వులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో నువ్వులు ఎంతో ఉపయోగపడతాయి. కాల్షియంను అధికంగా కలిగిన ఆహార పదార్థాలలో నువ్వులు మొదటి స్థానంలో నిలుస్తాయి. కీళ్ల నొప్పులను తగ్గించడంలోనూ నువ్వులు సహాయపడతాయి. కేవలం నువ్వులను, బెల్లాన్ని ఉపయోగించి లడ్డూలను కూడా తయారు చేస్తూ ఉంటారు. వీటిని నువ్వుల లడ్డూలు, నువ్వుల ఉండలు అని కూడా అంటుంటారు. వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ నువ్వుల లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
నువ్వుల లడ్డూలు తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నువ్వులను వేసి నువ్వులు కొద్దిగా రంగు మారే వరకు చిన్న మంటపై వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నెయ్యిని వేసి నెయ్యి కాగాక బెల్లాన్ని వేసి మధ్యస్థ మంటపై బెల్లం కరిగే వరకూ తిప్పుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. ఆ తరువాత వేయించిన నువ్వులను కొద్ది కొద్దిగా వేసుకుంటూ నువ్వులు, బెల్లం పూర్తిగా కలిసే వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ కావల్సిన పరిమాణంలో లడ్డూలలాగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నువ్వుల లడ్డూలు తయారవుతాయి.
ఇలా తయారు చేసుకున్న వాటిని మూత ఉండే డబ్బాలో ఉంచడం వల్ల 10 రోజుల పాటు తాజాగా ఉంటాయి. రోజుకి ఒకటి లేదా రెండు లడ్డూల చొప్పున తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. శరీరంలో ఉండే నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. నువ్వుల లడ్డూలను తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, ఊబకాయం, పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. శరీరానికి కావల్సినన్ని ప్రోటీన్లను అందించడంలో ఈ లడ్డూలు ఎంతో ఉపయోగపడతాయి. రక్త హీనత సమస్యతో బాధపడే వారికి నువ్వుల లడ్డూలు ఒక దివ్య ఔషధమని వైద్య నిపుణులు చెబుతున్నారు.