Eye Sight : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనేక రకాల అనారోగ్య సమస్యలల్లో కంటి చూపు మందగించడం కూడా ఒకటి. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుత కాలంలో టీవీలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్ ల వాడకం రోజు రోజుకీ ఎక్కువవుతోంది. వీటిని తదేకంగా చూడడం వల్ల కళ్లు ఎర్రబడడం, కళ్లు మండడం, కళ్లు పొడిబారడం, కంటి చూపు మందగించడం వంటి సమస్యలను మనలో చాలా మంది ఎదుర్కొంటున్నారు. నిద్రలేమితోపాటు సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి వాటిని కూడా కంటి చూపు మందగించడానికి కారణాలుగా చెప్పవచ్చు. కంటి చూపు మందగించి చాలా చిన్న వయస్సు నుండే కళ్లద్దాలు వాడే వారిని మనం ఎక్కువగా చూస్తున్నాం.

మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. కంటి సమస్యలను తగ్గించి, కంటి చూపును మెరుగుపరిచే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంటి సమస్యలను అధిగమించడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలలో కోడి గుడ్లు మొదటి స్థానంలో నిలుస్తాయి. వీటిలో ఉండే జింక్ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక గుడ్డును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మొక్కజొన్న కంకులు కూడా కంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. మొక్క జొన్న గింజలను రోజూ ఒక కప్పు చొప్పున తీసుకోవడం వల్ల కంటికి ఎంతో మేలు కలుగుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో విటమిన్ ఎ సహాయపడుతుందని మనందరికీ తెలుసు. విటమిన్ ఎ ను అధికంగా కలిగిన ఆహార పదార్థాలలో క్యారెట్ లు ఒకటి. కంట్లో శుక్లాలు రాకుండా చేయడంలో కూడా క్యారెట్ దోహదపడుతుంది. ప్రతిరోజూ ఒక క్యారెట్ ను తినడం వల్ల కంటి సమస్యలు తగ్గడంతోపాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
కంటి చూపును మెరుగుపరిచే ఆహారాలలో పాలకూర ఒకటి. పాలకూరలో ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్లు కంటి చూపును మెరుగుపరచడంలో తోడ్పతాయి. కంటి చూపును పెంచే ఇతర ఆహారాలలో పాలు ఒకటి. ప్రతిరోజూ పాలను తాగడం వల్ల కంటి చూపు స్పష్టంగా ఉంటుంది. అంతే కాకుండా శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. నానబెట్టిన బాదం పప్పును తినడం వల్ల లేదా బాదం పాలను తాగడం వల్ల కూడా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దృష్టి లోపాలను, రేచీకటిని రాకుండా చేసే ఆహారాలలో చేపలు ఒకటి. తరచూ చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
కంటిలో ఉండే రెటీనా సంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో టమాటాలు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. బాదం నూనెను, ఆలివ్ నూనెను కంటిచుట్టూ, కంటి రెప్పలపై రాయడం వల్ల కళ్లు పొడి బారకుండా ఉంటాయి. ఇలా ఆహారాలను తీసుకోవడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది.