Shanagapindi Chutney : మనం ఉదయం పూట అల్పాహారాలను తినడానికి రకరకాల చట్నీలను తయారు చేస్తూ ఉంటాం. చట్నీ రుచిగా ఉంటేనే మనం చేసిన అల్పాహారాలు రుచిగా ఉంటాయి. అలాగే మనకు హోటల్స్ లో కూడా వివిధ రకాల చట్నీలను సర్వ్ చేస్తూ ఉంటారు. హోటల్స్ లో ఎక్కువగా లభించే చట్నీలలో శనగపిండి చట్నీ ఒకటి. శనగపిండిని ఉపయోగించి చేసే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దోశ, ఇడ్లీ వంటి వాటిని ఈ చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ శనగపిండిని చట్నీని సులువుగా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శనగపిండి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – 4 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన టమాట – 1, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – 2 రెమ్మలు, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, పసుపు – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్.
శనగపిండి చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, చింతపండు రసం వేసి ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, అల్లం ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు కలుపుతూ వేయించాలి. తరువాత ముందుగా కలుపుకున్న శనగపిండి మిశ్రమం వేసి కలపాలి. దీనిని కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగపిండి చట్నీ తయారవుతుంది. ఈ శనగపిండి చట్నీని ఇడ్లీ, దోశ, పూరీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీలతో పాటు శనగపిండి చట్నీని కూడా తయారు చేసుకుని తినవచ్చు.