Siriyali : సిరియాలి.. పెసరపప్పుతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఈ సిరియాలిని పూర్వకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందాలనుకునే వారు ఈ సిరియాలిని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ సిరియాలిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సిరియాలి తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు -ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తురుము – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, చింతపండు – చిన్న నిమ్మకాయంత, నీళ్లు – అర కప్పు, బెల్లం – ఒక చిన్న ముక్క, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

సిరియాలి తయారీ విధానం..
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి 4 గంటలపాటు నానబెట్టుకోవాలి. అలాగే చింతపండును ఒక కప్పు నీటిలో నానబెట్టి దాని నుండి రసాన్ని తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఈ పప్పును జార్ లో వేసుకోవాలి. ఇందులోనే రెండు చిటికెల వంటసోడా వేసి మిక్సీ పట్టుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. తరువాత ఒక గిన్నను తీసుకుని అందులో అరటి ఆకును ఉంచాలి. అరటి ఆకు అందుబాటులో లేని వారు గిన్నెకు నూనె కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండిని గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో స్టాండ్ ను ఉంచి అందులో నీళ్లు పోయాలి. తరువాత పిండి గిన్నెను ఉంచి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. తరువాత గిన్నెను బయటకు తీసి చల్లారనివ్వాలి.
ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత చింతపండు రసం, నీళ్లు వేసి కలపాలి. ఇప్పుడు బెల్లం వేసి కలపాలి. దీనిని 5 నిమిషాల పాటు ఉడికించిన తరువాత ఉడికించిన పెసరపప్పు మిశ్రమాన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సిరియాలి తయారవుతుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వేసవికాలంలో దీనిని తీసుకోవడం వల్ల మరింత మేలు కలుగుతుందనే చెప్పవచ్చు.