Karam Panasa Thonalu : పనస తొనలు.. మనం చేసే పిండి వంటకాల్లో ఇవి కూడా ఒకటి. తియ్యటి పనస తొనలు, కారం పనస తొనలు ఇలా రెండు రకాలుగా వీటిని తయారు చేస్తూ ఉంటాము. కారం పనస తొనలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్లలు మరింత ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. కరకరలాడుతూ రుచిగా ఉండే ఈ పనస తొనలను తయారు చేయడం చాలా సులభం. అందరికి ఎంతో నచ్చే ఈ కారం పనస తొనలను సులభంగా, క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కారం పనస తొనల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – రెండు చిటికెలు, వాము – ఒక టీ స్పూన్, వేడి నూనె – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, అల్లం – ఒక ఇంచు ముక్క, పచ్చిమిర్చి – 1.
కారం పనస తొనల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, వంటసోడా, వాము వేసి కలపాలి. తరువాత వేడి నూనె వేసి కలపాలి. ఇప్పుడు అల్లాన్ని, పచ్చిమిర్చిని కలిపి పేస్ట్ లాగా చేసుకుని వేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని గట్టిని కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు పిండిని మరో 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ పలుచగా చపాతీలా వత్తుకోవాలి. తరువాత చాకుతో అంచులను వదిలేసి చపాతీ మధ్యలో గాట్లు పెట్టుకోవాలి.
తరువాత అంచులను దగ్గరికి వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసిన తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడయ్యాక పనస తొనలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిపై కారాన్ని చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కారం పనస తొనలు తయారవుతాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి.