Sorakaya Dappalam : అనపకాయ.. దీనినే సొరకాయ అని కూడా అంటారు. అనపకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అనపకాయతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే అనపకాయను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అనపకాయతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో అనపకాయ దప్పళం కూడా ఒకటి. అపనకాయ దప్పళం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ అనపకాయ దప్పళాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అనపకాయ దప్పళం తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన అనపకాయ – 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు -ఒక కప్పు, తరిగిన టమాట ముక్కలు – ఒక కప్పు, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, నానబెట్టిన చింతపండు – ఒక చిన్న నిమ్మకాయంత, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 6, ఇంగువ – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, బెల్లం -ఒక చిన్న ముక్క, పసుపు – పావు టీ స్పూన్, సాంబార్ పొడి -ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.
అనపకాయ దప్పళం తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో అనపకాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాట, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోయాలి. తరువాత దీనిపై మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో చింతపండు రసం, బెల్లం, సాంబార్ పొడి వేసి కలపాలి. దీనిని మరో 15 నిమిషాల పాటు నీరంతా పోయే వరకు ఉడికించాలి. కూర దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని కూరలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అనపకాయ దప్పళం తయారవుతుంది.దీనిని అన్నం, దోశ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా అనపకాయతో చేసిన దప్పళాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.