Ginger Garlic Paste : మనం వంటల్లో రుచి కొరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వాడుతూ ఉంటాము. దాదాపు మనం చేసే ప్రతి వంటలో దీనిని ఉపయోగిస్తూ ఉంటాము. అల్లం, వెల్లుల్లి రెండు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. వీటిని వంటల్లో వాడడం వల్ల రుచి, వాసనతో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. మనం సాధారణంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటాము. ఈ పేస్ట్ ను ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసినప్పటికి ఎక్కువ కాలం పాటు ఉంచడం వల్ల దీని తాజాదనం, వాసన పోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడైపోనప్పటికి దీని తాజాదనం పోవడం వల్ల వంటల్లో వేసినప్పటికి పెద్దగా రుచి, వాసన ఉండదు.
అయితే ఇప్పుడు చెప్పే విధంగా అల్లం వెల్లుల్లి తయారు చేసుకుని నిల్వ చేసుకోవడం అది 3 నుండి 4 నెలల పాటు చక్కటి వాసనతో ఎంతో తాజాగా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు తాజాగా ఉండేలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం అల్లం, వెల్లుల్లిని సమానంగా తీసుకోవాలి. తరువాత అల్లంపై ఉండే పొట్టును తీసేసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత దీనిని తడి పోయే వరకు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. అలాగే వెల్లుల్లిపై ఉండే పొట్టును తీసేసుకోవాలి.
ఇప్పుడు జార్ లో వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్ల ఉప్పు, అర కప్పు నూనె పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని మూత ఉండే గాజు సీసాలో 90 శాతం వరకు నింపాలి. మిగిలిన భాగాన్ని నూనెతో నింపి మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట ఉంచినప్పటికి 3 నుండి 4 నెలల పాటు తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వంటల్లో వాడడం వల్ల కూరలు కూడా చాలా రుచిగా ఉంటాయి.